Sakshi News home page

మార్స్.. మేమొస్తున్నాం..

Published Tue, Nov 5 2013 3:03 AM

Isro prepares for propellant filling in PSLV C25

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ25..  అంగారక యాత్రకు సర్వం సిద్ధం
 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌కు ఆదివారం ఉదయం 6.08 నుంచి నిర్విఘ్నంగా కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్లనుంది. తద్వారా గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది.
 
 దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేయనున్నారు.
 
 310 రోజుల ప్రక్రియ
 మార్స్ ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తున్నారు. రాకెట్‌కు తొలి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకండ్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశను పూర్తి చేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కి.మీ. ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.6 సెకన్లలో 194.869 కి.మీ. ఎత్తులో మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కి.మీ. ఎత్తులో నాలుగో దశను పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. నాలుగో దశలో 2656.72 సెకన్లకు, భూ ధీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశపెడుతుంది. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనం సాయంతో ఐదుసార్లు మండించి, దాన్ని అంగారకుడి వైపు మళ్లించే ప్రక్రియను చేపడతారు. అప్పటినుంచి దాదాపుగా 310 రోజుల తరవాత, అంటే 2014 సెప్టెంబర్ 28 నాటికి అంగారకుడి కక్ష్యలో 360‘80,000 కిలో మీటర్లు ఎత్తులో అంగారకుడి చుట్టూరా తిరుగుతూ పరిశోధనలను ప్రారంభిస్తుంది.

తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు
 సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సోమవారం వేకువజామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఎంవోఎం నమూనా ఉపగ్ర హం, దాన్ని మోసుకెళ్లే పీఎస్‌ఎల్‌వీ సీ25 నమూనా రాకెట్‌ను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తర్వాత వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.
 
 సుదూర ప్రయోగమిది: రాధాకృష్ణన్
 అరుణగ్రహంపై పరిశోధనల కోసం ఈ ప్రయోగం చేపట్టామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సుదూర ప్రయోగానికి షార్‌లో ఆదివారం కౌంట్‌డౌన్ ఆరంభమైందని, మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో జీఎస్‌ఎల్‌వీ-డీ5 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement