గుప్త నిధి గుట్టు రట్టు | Sakshi
Sakshi News home page

గుప్త నిధి గుట్టు రట్టు

Published Mon, Dec 12 2016 2:44 AM

ఏపీ సీఎం చంద్రబాబుతో శేఖర్‌రెడ్డి(ఫైల్‌) - Sakshi

- శేఖర్‌రెడ్డి ఇంటి గోడలో కరెన్సీ కట్టలు వెలికితీత
- స్టార్‌ హోటల్‌ గదిలో 40 కేజీల బంగారం పట్టివేత
- పన్నీర్‌ సెల్వంతోనూ శేఖర్‌రెడ్డికి సంబంధాలు!


సాక్షి, చెన్నై/వేలూరు:
నల్ల కుబేరుడు శేఖర్‌రెడ్డి ఇంటా బయటా తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడుతున్నాయి. ఆదివారం చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో 40 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు వెలికితీశారు. వేలూరులో సాగిన తనిఖీల్లో ఆరు బ్యాగుల్లో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లు ఎంత మొత్తం అన్నది అధికారులు వెల్లడించలేదు. పలువురు ప్రముఖులు, బ్యాంకు అధికారులు, శేఖర్‌రెడ్డి సన్నిహితులు లక్ష్యంగా దాడులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

జయలలిత మరణానంతరం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వంతో కూడా శేఖర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని కొన్ని స్థానిక చానెళ్లలో కథనాలు ప్రసారమ య్యాయి. శేఖర్‌రెడ్డి ఆస్తులపై గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు సాగుతున్నాయి. శనివారం నాటికి సుమారు రూ. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం పట్టుబడింది. ఆదివారం శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీని అధికారులు శనివారం విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఐటీ వర్గాలు ఆరు ట్రావెల్‌ బ్యాగుల్లో నోట్లకట్టల్ని, రెండు సూట్‌కేసుల్లో బంగారాన్ని, కీలక పత్రాలను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నోట్ల కట్టలు ఇంటి గోడలో ఏర్పాటు చేసిన అరలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పన్నీర్, శశికళ లక్ష్యంగా దాడులు
గత 4 రోజులుగా శేఖర్‌రెడ్డిఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు తాజాగా తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళ సన్నిహితుల ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు తెలిసింది. చెన్నైతో పాటు తిరునల్వేవి, వెల్లూరు, కాట్పాడి సహా 16 ముఖ్య ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో సీబీఐ, ఈడీ అధికారులు కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement