'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు' | Sakshi
Sakshi News home page

'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'

Published Tue, Oct 14 2014 5:10 AM

'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'

తాను దేవుళ్లను పూజించనని బాలబంధు, నోబెల్ శాంతి పురస్కార విజేత కైలాష్ సత్యార్థి తెలిపారు. పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని చెప్పారు. వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని వెల్లడించారు. తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాలలే తన బలమని అన్నారు. ఇంజినీరింగ్ కెరీర్ ను వదులుకున్నప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....

'నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతావని అప్పుడు మా అమ్మతో చెప్పా. వ్యక్తిగతంగా ఆడంబరాలు, అవార్డులు, పురస్కారాలు నాకు ఇష్టం ఉండవు.

ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పాను. 1989 నుంచి బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ఈ విషయాలన్ని నోబెల్ కమిటీ పరిశీలించింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు వచ్చే నగదు ఏవిధంగా ఖర్చు చేయాలనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 400 మంది బాలలతో కూడిన బాల మహాపంచాయతీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చుచేస్తాం. ప్రతిపైసా  చిన్నారుల సంక్షేమం కోసం ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష.

మేము కొత్తగా చేపట్టిన 'పీస్ ఫర్ చిల్డ్రన్' కార్యక్రమంలో చేరాలని నాతో కలిసి నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆహ్వానించాను. భారత్, పాకిస్థాన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చిన్నారులు శాంతియుత వాతావరణంలోనే పెరగాలి. మాలాలా అంటే నాకెంతో గౌరవం. పాకిస్థాన్ లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు నేను మద్దతుపలికే నాటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. 1987లో పాకిస్థాన్ సైన్యం నన్ను లాహోర్ వెలుపల మట్టుబెట్టాలని చూసింది. ఇటుక తయారీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ సైనికులు వచ్చి నా తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వాను. కొన్ని నిమిషాలు ఆగితే నా ప్రసంగం పూర్తవుతుంది తర్వాత నన్ను చంపండి అని సమాధానమిచ్చాను.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భావిస్తున్నాం. టీ అమ్మే స్థాయిని నుంచి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగానని మోడీ చెబుతున్నారు. ఇక ఏ చిన్నారి బాలకార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతి కుర్రాడు దేశ ప్రధాని కాలేడు. కానీ ప్రతి పిల్లాడు స్కూల్ కు వెళ్లగలడు. మంచి విద్య పొందగలడు' అని కైలాష్ సత్యార్థి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement