Sakshi News home page

జగన్ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా

Published Sat, Sep 28 2013 4:03 AM

Jagan Mohan Reddy's petition hearing adjourned to 30th Sept 2013

సాక్షి, హైదరాబాద్: బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదాపడింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ శుక్రవారం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... విచారణను వాయిదా వేశారు.

 

ఇదిలా ఉండగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 4కు వాయిదాపడింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని సీబీఐ కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 1కి వాయిదా పడింది. కౌంటర్ కాపీని ఢిల్లీకి పంపామని, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత కోర్టులో దాఖలు చేస్తామని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ కోర్టుకు నివేదించారు.
 
 బెయిల్ పిటిషన్ విచారణకు అంత తొందరేమొచ్చిందని, విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేయాలని ఆయన చెప్పడంపై సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 20 నెలలుగా సునీల్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారని, కౌంటర్ దాఖలుకు అంత గడువు కోరడం సమంజసం కాదని అన్నారు. అక్టోబర్ 1న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి వాదనలు వినిపించేలా సీబీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. స్పందించిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై విచారణను 1వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement
Advertisement