ఆ క్రికెటర్‌ను మళ్లీ తిట్టేశారు! | Sakshi
Sakshi News home page

ఆ క్రికెటర్‌ను మళ్లీ తిట్టేశారు!

Published Wed, Aug 23 2017 9:24 AM

ఆ క్రికెటర్‌ను మళ్లీ తిట్టేశారు! - Sakshi

సమాజంలోని వివిధ అంశాలపై స్పందించడంలో, నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడంలో భారత మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ ముందుంటాడు. ఆయన గతంలో పలు సందర్భాల్లో సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా మతవాదులు కైఫ్‌పై విరుచుకుపడ్డారు. కైఫ్‌ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని అక్కస్సు వెళ్లగక్కారు.

తాజాగా సత్వర ట్రిపుల్‌ తలాఖ్‌ చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై కైఫ్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. 'ట్రిపుల్‌ తలాఖ్‌ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఈ తీర్పు మహిళలకు భద్రతను ఇస్తుంది. లింగ సమానత్వం నెలకొనాల్సిన ఆవశ్యకత ఉంది' అని కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. కైఫ్‌ స్పందనను నెటిజన్లు చాలామంది స్వాగతించినప్పటికీ.. ఎప్పటిలాగే కొంతమంది ఆయనపై విరుచుకుపడ్డారు. 'ఏ సంతోషం కోసం మీరు ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారు?' అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. 'కైఫ్‌ బాబు నీకు తెలియని విషయంపై స్పందించకు' అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

'ట్రిపుల్‌ తలాఖ్‌ ఖురాన్‌కు  వ్యతిరేకమైతే.. వందేమాతరం కూడా ఖూరాన్‌కు వ్యతిరేకమే. అల్లాను మించిన దేవుడు లేడు' అని నెటిజన్‌ చెప్పుకొచ్చాడు. ఇలా కైఫ్‌ను కించపరిచే ట్వీట్లు కొన్ని వచ్చినా.. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ కూడా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement