దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరాన్నే దొంగిలిస్తారా? | Sakshi
Sakshi News home page

దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరాన్నే దొంగిలిస్తారా?

Published Wed, Apr 12 2017 9:43 PM

దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరాన్నే దొంగిలిస్తారా? - Sakshi

సింహాచలం(విశాఖపట్టణం): ’దర్శనానికి వచ్చి స్వామివారి ఉంగరాన్నే దొంగలిస్తారా... అదేం పని...దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి. లేదంటే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..’ అంటూ బుధవారం సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు.

‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేస్తారంటారేంటి? పైగా తాళ్లతో బంధిస్తారా... ’అంటూ భక్తులు తట్టుకోలేని ఆవేశంతో స్థానాచార్యులని ఎదురు ప్రశ్నించారు.

‘చూడండి... మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. మీరు ఉంగరాన్ని తీసిన దృశ్యం మా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.. ’అంటూ స్థానాచార్యులు మరింత గద్దించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.

తాము దొంగలం కాదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని స్థానాచార్యులు పదేపదే అనడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. తమకు మాత్రమే దక్కిన  భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు.

ఇదీ... సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వినోదోత్సవం. ఈనెల 6 వతేదీ నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లికీలో ఆశీనింపజేశారు. స్వామివారి దూతగా అర్చకుడు సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ వారిని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందగా, ఉత్సవ విశేషాలు తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖ గీతం కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం పరీక్షలు రాసి స్వామివారి దర్శనానికి వచ్చిన కాకినాడకి చెందిన హారిక, హోటల్‌మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్న ఖరగ్‌పూర్‌కు చెందిన వరలక్ష్మి, వేపగుంటకి చెందిన సంధ్య, హనుమాన్‌ జంక్షన్‌కి చెందిన దిలీప్, విశాఖ ఆర్‌కెబీచ్‌కి చెందిన శ్వేతాకన్నా, కన్నప్రియ, షర్మిళ, ప్రహ్లాదపురంనకు చెందిన హాసిని, గోపాలపట్నంనకు చెందిన హైమావతి, ఢిల్లీకి చెందిన నాగభూషణం దంపతులు, కోయంబత్తూరు నగల వ్యాపారి ఆర్‌.ఎస్‌. గోపాల్‌చెట్టుమర, విశాఖలోని సాగర్‌ దుర్గా హాస్పటల్‌ ఈఎన్‌టీ వైద్యుడు బాపారావు అండ్‌ ఫ్యామిలి ఫ్రెండ్స్, సినీ నిర్మాత కొర్రపాటి సాయి, పలువురు నూతన దంపతులు, దేవస్థానం కొత్వాల్‌నాయక్, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు,  ఏఈవో ఆర్‌.వి.ఎస్‌. ప్రసాద్, పీఆర్‌ఓ జైముని, వినోదోత్సవంలో ఉంగరం దొంగలుగా చిత్రీకరింపబడ్డారు. అలాగే, ఉంగరం దొంగలెవరని ప్రశ్నించిన స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ కూడా ఉత్సవం ప్రారంభంలో ఉంగరం దొంగగా చిత్రీకరింపబడటం విశేషం. ఆయన్ని కూడా తాళ్లతో బంధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement