లాస్‌ రాకూడదని.. డైరెక్టర్‌కు చెక్‌ పంపాడు! | Sakshi
Sakshi News home page

లాస్‌ రాకూడదని.. డైరెక్టర్‌కు చెక్‌ పంపాడు!

Published Mon, Oct 24 2016 10:43 AM

లాస్‌ రాకూడదని.. డైరెక్టర్‌కు చెక్‌ పంపాడు!

‘మీ సినిమా చూడటం ఇష్టంలేదు. అయినా  ఈ సినిమా వల్ల మీరు నష్టపోవడం సాటి వ్యాపారవేత్తగా నాకు బాధ కలిగిస్తోంది. అందుకే ఈ చెక్కు పంపిస్తున్నా’ అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 350 చెక్కును కరణ్‌ జోహార్‌కు పంపించాడు.  (ఆ సీన్‌ కట్‌.. అప్పుడే మొదలైన లీకులు!)

పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించినందుకు ‘యే దిల్‌ హై ముష్కిల్‌’  విడుదలపై ఎమ్మెన్నెస్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సమక్షంలో చర్చలతో ఈ సినిమా విడుదలకు ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే అంగీకరించారు. అయితే, భవిష్యత్తులో పాక్‌ నటులతో సినిమాలు తీయవద్దని, పాక్‌ నటులతో సినిమాలు తీస్తే.. రూ. 5 కోట్లు భారత ఆర్మీ సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని రాజ్‌ ఠాక్రే షరతులు పెట్టారు. ఇందుకు కరణ్‌ జోహార్‌, బాలీవుడ్‌ నిర్మాతల సంఘం ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడింది. పాక్‌ నటులతో నిర్మితమైన కరణ్‌ జోహార్‌ సినిమాలు ’యే దిల్‌ హై ముష్కిల్‌’, ’డియర్‌ జిందగీ’ సినిమాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

అయితే, అంతకుముందు తన సినిమాల విడుదలకు అడ్డంకులు కల్పించవద్దని సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ వీడియోలో కరణ్‌ జోహార్‌ అభ్యర్థించారు. ఇలా అడ్డుకోవడం వల్ల తాను భారీగా నష్టపోతానని వాపోయారు. దీంతో కరణ్‌ జోహార్‌ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన ముఖం చూసి ఓ వ్యాపారవేత్త సినిమా చూడకూండానే చెక్కు పంపించారనే శిల్పీ తివారీ ట్విట్టర్‌లో వెల్లడించారు. కళ కోసం కాకుండా తనకొచ్చే నష్టాల కోసం కరణ్‌ బాధపడ్డారని, అందుకే ఆయన సినిమా చూడాలనే ఉద్దేశం లేకపోయినా.. ఆయన నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు టికెట్ల ధర (రూ. 160 చొప్పున)ను ఆయనకు పంపిస్తున్నట్టు ఆ వ్యాపారవేత్త తన లేఖలో తెలిపారు.

Advertisement
Advertisement