భారీగా చేరుకున్న కర్ణాటక పోలీసులు | Sakshi
Sakshi News home page

భారీగా చేరుకున్న కర్ణాటక పోలీసులు

Published Thu, Jul 16 2015 6:06 PM

భారీగా చేరుకున్న కర్ణాటక పోలీసులు

పుష్కరఘాట్ (రాజమండ్రి) : గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలోని గోదావరి ఘాట్ల వద్ద బందోబస్తు పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. దీనిలో భాగంగా గురువారం కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు భారీ స్థాయిలో పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. ఏ ఏ అధికారి ఏ ఏ సమయాల్లో ఎక్కడ విధులు నిర్వహించాలనే అంశంపై చర్చించుకున్నారు. పుష్కరఘాట్‌లో ప్రమాదం సంభవించడంతో ఆ ఘాట్‌లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.

కాగా గోదావరిలో పుష్కర స్నానం పూర్తయిన వారిని బయటకు పంపడంలో మాత్రం భద్రతా సిబ్బంది విఫలమవుతూనే ఉన్నారు. స్నానం పూర్తయినప్పటికీ చాలా మంది భక్తులు ఘాట్లలో ఉండిపోవడం, బయట నుంచి వేరే భక్తులు ఘాట్‌లోకి ప్రవేశిస్తుండడంతో ఘాట్‌లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. కొంతమంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించకుండా సమీపంలోని మెట్లపై కూర్చుని బాతాఖానీ వేసుకోవడం పట్ల నగర ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తేనే భక్తులు క్షేమంగా ఇంటికి చేరుకుంటారంటున్నారు. తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ పుష్కరఘాట్‌లో భక్తులను నియంత్రించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు సిబ్బంది పనితీరుపై నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement