దేశద్రోహం కేసు పెట్టినా సెటైర్లు ఆపలేదు!

28 Sep, 2016 18:51 IST|Sakshi
దేశద్రోహం కేసు పెట్టినా సెటైర్లు ఆపలేదు!

పట్నా: బిహార్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. అధికార జేడీయూ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు శాస్త్రి నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై సెక్షన్‌ 124 ఏ (దేశద్రోహం) నమోదైంది. మరోవైపు ఓ లాయర్‌ కూడా ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

బిహార్‌ను తీసుకుంటామనే షరతు మీద కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేందుకు సిద్ధమని, కశ్మీర్‌ను బిహార్‌తో కలిపి ప్యాకేజీగా ఇస్తామని, బిహార్‌ వద్దంటే కశ్మీర్‌ కూడా ఇవ్వబోమని జస్టిస్‌ కట్జూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సహా పలువురు నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో తనవి సరదా వ్యాఖ్యలు మాత్రమేనని వివరణ ఇచ్చిన కట్జూ బుధవారం మళ్లీ తన పాత ధోరణిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై కావాలంటే బిహారీలు ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు. 'బిహార్‌కు నేను అమ్మనా, నాన్ననా అని నితీశ్‌కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. బిహార్‌కు నేను అమ్మానాన్నను కాదు కానీ శకుని మామను' అంటూ పేర్కొన్నారు. 'వస్త్రాపహారణం జరుగుతుంటే ద్రౌపది గౌరవాన్ని కాపాడుకునేందుకు కృష్ణుణ్ని ప్రార్థించింది' అంటూ పరోక్షంగా నితీశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు