షెడ్యూల్‌కు ముందే తెలంగాణ! | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌కు ముందే తెలంగాణ!

Published Wed, Feb 26 2014 12:33 AM

షెడ్యూల్‌కు ముందే తెలంగాణ! - Sakshi

ప్రధానిని కోరిన కేసీఆర్
రెండు రాష్ట్రాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని వినతి
హోంమంత్రితో చర్చిస్తాన న్న ప్రధాని
తెలుగు ప్రజలుగా కలసి సాగాలని హితవు
రాజ్‌నాధ్‌సింగ్‌తో భేటీ, అపాయింటెడ్ డే త్వరగా వచ్చేలా చూడాలని వినతి
 
 సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేలా అపాయింటెడ్ డేను త్వరగా ప్రకటించాలని విన్నవించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా రాష్ట్రపతి సంతకం కాకపోవడంతో తెలంగాణలోని సగటు ప్రజల్లో రాష్ట్రం వచ్చిన భావనలేదని వివరించినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు దీన్ని తప్పుగా చిత్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత త్వరగా అపాయింటెడ్ డేను ప్రకటించాలని కోరారు. కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలు మందా జగన్నాథం, వివేక్,  కె.కేశవరావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే కేటీఆర్, నేతలు శేరి సుభాష్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు మంగళవారం ఉదయం ప్రధానితో ఆయన నివాసంలోని కార్యాలయంలో 15 నిమిషాలపాటు భేటీఅయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల సమాచారం మేరకు...
 
 ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానిగా మీ పాత్ర చాలా గొప్పది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంలో మీ సహకారం మరువలేనిది. అయితే పరిపూర్ణ తెలంగాణ ఏర్పాటు రాష్ట్రపతి సంతకానికి అడుగు దూరంలో ఉంది. ప్రజలంతా రాష్ట్రపతి సంతకం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ దృష్ట్యా త్వరగా గెజిట్ నోటిఫికేషన్‌ను వెలువరించి సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటుచేసేలా అపాయింటెడ్ డేను ప్రకటించాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయింద నే భావన ప్రజల్లో కలుగుతుంది’’ అని కేసీఆర్ వివరించారు.
 
 ‘‘ఈ విషయాన్ని పరిశీలిస్తా. కేంద్ర హోంమంత్రితో మాట్లాడతా. విభజన జరిగినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలసి ముందుకు సాగాలి. రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు తగిన భరోసా ఇవ్వాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ నేతలపై ఉంది. హైదరాబాద్‌ను ప్రగతిశీల నగరంగా తీర్చిదిద్దుకోవాలి’’ అని ప్రధాని సూచించారు.
 
  ‘‘సీమాంధ్రులకు ఎలాంటి భయాలు వద్దని, వారికి పూర్తి రక్షణ ఉంటుందని బిల్లు ఆమోదం పొందిన రోజే ప్రకటించా. ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తాం. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా. దానికి కేంద్ర సహాయ సహకారాలు కావాలి’’ అని కేసీఆర్ చెప్పారు.
 ఇదే సమయంలో తెలంగాణ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ఏడు అంశాలపై త్వరితగతిన కేంద్రం స్పందించాలని కోరుతూ కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, సీమాంధ్రకు మాదిరే తెలంగాణకు ప్రత్యేక స్థాయి హోదా, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ల ఏర్పాటు, సెంట్రల్ పోల్ నుంచి అదనపు విద్యుత్ కేటాయింపులపై విన్నవించినట్లు తెలిసింది.
 
 దీనికి ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ... అన్ని అంశాలపై ఫైనాన్స్ కమిషన్‌తో మాట్లాడతానని చెప్పారని నేతలు వెల్లడించారు.
 
 రాజ్‌నాథ్‌తోనూ భేటీ..
 
 ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ నేతృత్వంలోని బృందం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైంది. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ అత్యంత సానుకూలంగా స్పందించినందుకు రాజ్‌నాథ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా త్వరగా అపాయింటెడ్ డేను ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు నేతలు తెలిపారు.
 

Advertisement
Advertisement