Sakshi News home page

భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్‌

Published Sat, Dec 24 2016 12:20 AM

భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్‌ - Sakshi

► ఉద్యోగ బదిలీలపై ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్‌
► ‘పది రోజుల్లో’ కారుణ్య నియామకాలు
► రిటైరయ్యే ఉద్యోగులకు చివరి రోజునే పూర్తి పెన్షన్‌
► ప్రభుత్వ వాహనంలో ఇంటిదాకా పంపాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌:
భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా ఉద్యోగుల బదిలీలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జోనల్‌ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఇకపై రాష్ట్ర, జిల్లాస్థాయి కేడర్లు మాత్రమే ఉంటాయని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో అవసరమైన సర్వీసు నిబంధనలు, విధి విధానాలు రూపొందిం చాలని ఆదేశాలిచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు సమావేశమై ఈ విషయంలో స్పష్టతకు రావాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉద్యోగుల అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, టీఎన్‌జీవో సంఘం ప్రతినిధులు దేవీ ప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, ఎం.రాజేందర్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఎంతో బాధతో, కష్టంలో ఉంటుందని, ఉద్యోగ నియామకానికి వారిని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవటం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అర్హతను బట్టి పది రోజుల్లోగా ఉద్యోగాల్లో నియమించాలని ఆదేశించారు. వయసు, విద్యార్హతల విషయంలో మినహాయింపులు ఇచ్చే విషయంలో అవసరమైతే కలెక్టర్లకు అధికారాలు బదలాయించాలని చెప్పారు. రిటైరయ్యే ఉద్యోగులకు చివరి రోజునే పూర్తి పెన్షన్‌ అందించాలని ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగిని ప్రభుత్వ వాహనంలో ఇంటి దాకా పంపించి రావాలని సూచించారు. మూడు నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించిన ఉద్యోగుల విషయంలో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఇతర ఉద్యోగులకుందని చెప్పారు.

అడ్‌ హాక్‌ టీచర్ల క్రమబద్ధీకరణ
ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న 18 మంది అడ్‌ హాక్‌ టీచర్లను రెగ్యులరైజ్‌ చేయాలని సీఎం నిర్ణయించారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement