మీ ఆశీర్వాదాలు కావాలి ! | Sakshi
Sakshi News home page

మీ ఆశీర్వాదాలు కావాలి !

Published Mon, Jul 13 2015 1:29 AM

KCR to wishes dawat-a-ifthar of muslims

* అల్లా దయతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది
* ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో సీఎం కేసీఆర్
* మంచి పనులు, పుణ్య కార్యక్రమాలతో ముందుకు పోదాం..
* ఇక్కడి రాజు గొప్పవాడని మహాత్మాగాంధీయే అన్నారు    

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నేను జాతి(వతన్) బిడ్డను. మీ బిడ్డను. మీ అందరీ ఆశీర్వాదాలు నాకు కావాలి. మీ ఆశీస్సులతో మంచి పనులు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోదాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటివరకు తాము చేసింది చాలా తక్కువ అని, చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. పెద్దల ప్రార్థనలు, అల్లా ఆశీస్సులతో రాష్ట్రం కొంత వరకు సమస్యలను అధిగమించిందన్నారు.
 
 రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని, ఇప్పుడు పూర్తిగా సమసిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇకపై విద్యుత్ కోతలుండవని స్పష్టంచేశారు. సాగునీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, నీళ్లకు సంబంధించి ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ముస్లింలకు దావత్-ఏ-ఇఫ్తార్ ఇచ్చారు. శాసన మండలి చైర్మన్  టి.స్వామిగౌడ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, అదనపు డీజీ సుదీప్ లక్తాకియా, టర్కీ, ఇరాన్ దేశాల కాన్సులేట్ జనరల్స్ అగా హసన్ నూరియాన్, మురాద్ ఉమర్ గుల్, ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అహ్మద్ బలాల, అమీన్ జాఫ్రీతో పాటు ముస్లిం మత పెద్దలు ఈ విందులో పాల్గొన్నారు.

ఉపవాస దీక్ష విరమణ సమయానికి ముందు వచ్చిన కేసీఆర్... విందుకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉర్దూలో అనర్గళంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కోరికను అల్లా నెరవేర్చాడన్నారు. ‘‘అల్లా దయ వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణకే ప్రత్యేకమైన ‘గంగా జమున తహజీబ్’ ఒకప్పుడు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్మాగాంధే స్వయంగా ఈ మాటను అన్నారు. ‘ఇక్కడి రాజు ఎంతో గొప్పవాడు. ఇక్కడి సంప్రదాయం ఎంతో గొప్పది. కలసి మెలసి జీవించడంతో ఉత్తర భారతదేశం హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవాలి.
 
 యావత్ ప్రపంచంలోనే ఇలాంటి అద్భుత ప్రాంతం లేదు’ అని 1927లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీ వివేకవర్ధిని కళాశాలలో చేసిన ప్రసంగంలో ప్రశంసించారు’’ అని సీఎం వివరించారు. కానీ ఆ తర్వాత కొద్దిగా దారితప్పామని, మళ్లీ పాత గంగా జమున తహజీబ్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. పాత పరిమళాన్ని మళ్లీ తాజా చేస్తామన్నారు.

రంజాన్ సందర్భంగా ఈ ఏడాది 1.75 లక్షల మందికి ఉచితంగా వస్త్రాల పంపిణీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 175 మసీదుల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామన్నారు. పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకే ఈ చిన్న ప్రయత్నం చేశామని, దీన్ని ఇలాగే పెంచుతూ ముందుకు వెళ్తామని చెప్పారు. నిమిత్తమాత్రుడైన (నాచీజ్) తాను ఇచ్చిన విందుకు వచ్చినందుకు అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సంప్రదాయానికి అనుగుణంగా ‘ఖుదా హాఫీజ్’ అంటూ ప్రసంగం ముగించారు.
 
 షేర్వానీలో సీఎం..
 ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ ముస్లిం సంప్రదాయ ఆహార్యమైన షేర్వానీ, పైజామా, ఇస్లామిక్ టోపీలో వచ్చారు. ముస్లిం మత పెద్ద ముఫ్తీ ఖలీల్ ప్రత్యేక ప్రార్థనలు జరిపిం చారు. హలీం, బిర్యానీ, డబల్ కా మీఠా, రుమాలీ రోటీ తదితర హైదరాబాదీ వంటకాలను అతిథులకు వడ్డించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement