ఈ రియల్ క్రైమ్ స్టోరీతో.. ఎన్నో సినిమాలు | Sakshi
Sakshi News home page

ఈ రియల్ క్రైమ్ స్టోరీతో.. ఎన్నో సినిమాలు

Published Mon, Mar 6 2017 9:41 AM

ఈ రియల్ క్రైమ్ స్టోరీతో.. ఎన్నో సినిమాలు

త్రివేండ్రం: సినిమా కథను మించిన రియల్ క్రైమ్ స్టోరీ కేరళలో జరిగింది. జీవిత బీమాను క్లయిమ్ చేసుకోవాలని పథకం వేసిన సుకుమార కురుప్ అనే వ్యక్తి.. తనలాగే ఉన్న ఓ వ్యక్తిని చంపేసి, తాను చనిపోయినట్టుగా సమాజాన్ని, అధికారులను నమ్మించాలని చూశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 1984లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి పోలీసులు కురుప్ కోసం గాలిస్తూనే ఉన్నారు.. కానీ 33 ఏళ్లు గడిచినా అతని ఆచూకీ కనుగొనలేకపోయారు. కోర్టు కురుప్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తూనే ఉంది కానీ నేటికీ మిస్టరీ వీడలేదు. కేరళ న్యాయచరిత్రలో సుధీర్ఘకాలం నడుస్తున్న కేసు ఇదే. ఈ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.

1984 నాటికి కురుప్ వయసు 38 ఏళ్లు. అప్పట్లో అబుదాబిలో పనిచేసేవాడు. 8 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. జర్మనీలో జరిగిన ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకున్న కురుప్.. తాను మరణించినట్టుగా ఆధారాలు సృష్టించి బీమా క్లయిమ్ చేసుకోవాలని పథకం పన్నాడు. ఇందుకు సోదరుడు భాస్కర పిళ్లై, డ్రైవర్ పొన్నప్పన్ సహకరించారు. మొదట కురుప్ లాగే ఉండే మనిషి డెడ్ బాడీ కోసం వీరు గాలించారు. దొరకపోవడంతో అతనిలాగే ఉండే వ్యక్తిని చంపి, కురుప్ మరణించినట్టు అందర్నీ నమ్మించాలని ప్లాన్ మార్చారు. కురుప్‌ లాగే ఎత్తు, బరువు ఉండే చాకో అనే వ్యక్తి వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వారు చాకోను కారులో ఎక్కించుకున్నారు. మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ చాకోకు ఇచ్చి, అపస్మారక స్థితిలోకి వెళ్లాక పిళ్లై అతన్ని చంపేశాడు. చాకో ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేలా కాల్చారు. 1984 జనవరి 22 ఆయన డెడ్‌బాడీని కారులో ఉంచి మవెలిక్కర సమీపంలోని కున్నం దగ్గర కారును తగలబెట్టారు. పోలీసులు మొదట కురుప్ చనిపోయినట్టు భావించారు. కాగా విచారణలో అది కురుప్ మృతదేహం కాదని తేలింది. విషపదార్థం ఇచ్చి చంపారని, మృతదేహాన్ని డ్రైవర్ సీటులో ఉంచి కారును కాల్చివేసినట్టు తేలింది. కురుపే ఈ హత్యకు పథకం వేసి ఉంటాడని పోలీసులు భావించారు. చాకో అదృశ్యమయ్యాక ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.

పోలీసులు కురుప్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలించారు. ఈ కేసును కేరళ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కురుప్ కోసం దేశమంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అతను ఉన్నట్టు సమాచారం వచ్చింది కానీ దొరకలేదు. ఈ కేసులో పిళ్లైకు జీవిత కారాగార శిక్ష పడింది. స్థానికులు కురుప్ భార్య, పిల్లలను ఊరి నుంచి వెళ్లగొట్టారు. ఆమె అబుదాబి వెళ్లి నర్సుగా పనిచేసింది. 2010లో కురుప్ కొడుకు వివాహం జరిగింది. ఈ వేడుకకు కురుప్ వస్తాడని భావించి పోలీసులు నిఘా వేశారు. ఈ పెళ్లికి అతను రాలేదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కురుప్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. మవెలికర ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇటీవల కురుప్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1990లో ముంబై ఎయిర్‌పోర్టులో చివరిసారి కురుప్ కనిపించినట్టు సమాచారం. అతని బంధువులకు లేఖ రాసినట్టు తెలుసుకున్నారు. అప్పటి నుంచి కురుప్ ఆచూకీ మిస్టరీగా మారింది.

Advertisement
Advertisement