‘కిక్’ కమలాకర్ | Sakshi
Sakshi News home page

‘కిక్’ కమలాకర్

Published Sun, Nov 22 2015 3:52 AM

‘కిక్’ కమలాకర్ - Sakshi

(శ్రీరంగం కామేష్) విజయవాడకు అతడో ‘మంచి దొంగ’.. జక్కంపూడిలోని ఓ కాలనీకి ‘లంకేశ్వరుడు’.. నేరాలు చేయడంలో ‘జెంటిల్ మెన్’.. నేరాల సొమ్ముతో సాయం చేయడంలో ‘కిక్’... పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన అంతర్రాష్ట్ర దొంగ దొరపల్లి కమలాకర్ నేపథ్యమిది. విజయవాడలో పుట్టిన కమలాకర్ 20 ఏళ్ల కింద చిన్న చిన్న నేరాలతో నేర జీవితం ప్రారంభించాడు. స్టూవర్ట్‌పురంలోని ‘దొంగలబడి’లో జేబులు కొట్టేసే (పిక్ పాకెటింగ్) మెళకువలను నేర్చుకున్నాడు. సొంత ఆలోచనలతోనే ‘దృష్టి మళ్లించడం (అటెన్షన్ డైవర్షన్)’లో నైపుణ్యం సాధించాడు. కమలాకర్‌పై హైదరాబాద్‌తో పాటు ఏపీలోని అనేక నగరాలు, పట్టణాల్లో కేసులున్నాయి.
 
 గురువు బ్యాగు చోరీతో మొదలు..
 కమలాకర్ తండ్రి వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాడు. అక్కడి ఓ టీచర్ పాఠాలను పక్కనపెట్టి.. విద్యార్థులతో తన సొంత పనులు చేయించుకునేవాడు. కొద్దిరోజులు ఆ టీచర్ చెప్పిన పనులు చేసిన కమలాకర్ ‘గురువు’గారిపై కక్షగట్టాడు. 1995లో ఆ టీచర్ ఓ నెల మొదట్లో తాను అందుకున్న జీతం సొమ్ము ఉన్న బ్యాగ్‌ను కమలాకర్‌కు ఇచ్చి... తన ఇంట్లో ఇవ్వాలని పంపాడు. అదే అదనుగా బ్యాగ్‌తో ఉడాయించిన కమలాకర్... ఇలా గురువు బ్యాగ్‌తో నేర జీవితం ప్రారంభించాడు.

తర్వాత విజయవాడలోనే చిన్న చిన్న నేరాలు చేశాడు. కొన్ని సార్లు పట్టుబడగా... స్థానికులు మందలించి వదిలేసేవాళ్లు. ఓసారి కిరోసిన్ చోరీ చేసిన కేసులో బాలనేరస్తుల సదనానికి వెళ్లాడు. విజయవాడ పోలీసు రికార్డుల ప్రకారం కమలాకర్‌పై తొలికేసు నమోదైంది మాత్రం 1999లో. ఇతర నేరాల కంటే ‘జేబులు కొట్టేయడమే (పిక్ పాకెటింగ్స్)’ సులువు అన్నది అతడి సిద్ధాంతం. ఈ నేరాల్లో పర్సులు, ఫోన్లు పోగొట్టుకున్న వారిలో పది శాతం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయరని గుర్తించి, దానినే వృత్తిగా చేసుకున్నాడు. పిక్ పాకెటర్లు ముఠాలుగా చేరుతారు. కానీ కమలాకర్ ముఠా కట్టకుండా... అవసరానికి తగ్గట్టు ‘జట్టు’ కడుతూ నేరాలు చేసేవాడు.
 
 దొంగల బడి.. రూ.10 వేల ఫీజు
 కమలాకర్ విజయవాడ జైల్లో ఉండగా స్టూవర్ట్‌పురం దొంగలతో పరిచయమైంది. వారి ద్వారా ఆ ఊరిలో దొంగల బడి ఉన్నట్లు తెలుసుకుని.. జైలు నుంచి బయటకు రాగానే అక్కడికి వెళ్లాడు. ఓ ‘బడి’లో చేరి రూ.10 వేల ఫీజు కూడా కట్టాడు. మూడు నెలల శిక్షణ తర్వాత ‘మాస్టార్లు’ కమలాకర్‌ను ‘పరీక్షలు’ పెట్టారు. రైలులో ఓ ప్రయాణికుడి పర్సును దొంగిలించాలని చెప్పారు. పర్సు చోరీ వరకు పక్కాగానే చేసినా.. ఆ విషయాన్ని ప్రయాణికుడు కనిపెట్టేయడంతో జనమంతా కమలాకర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో ఫెయిల్ ముద్ర వేసిన ‘పాఠశాల యాజమాన్యం’ అతడిని డీబార్ చేసింది.
 
 పోలీసులు ఆటో కొనిచ్చి ‘సహకరించారు’!
 కమలాకర్ నేరాలతో విసిగిపోయిన విజయవాడ పోలీసులు అతడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అప్పట్లోనే మరో వర్గానికి చెందిన మహిళను ప్రేమ వివాహం చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు సెంటిమెంట్‌ను వాడారు. భార్యాపిల్లలు, కుటుంబంతో హుందాగా బతకాలని సూచిస్తూ ఓ ఆటో సైతం కొనిపెట్టారు. ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన కమలాకర్... అది నడుపుతూనే అదును చూసుకుని నేరాలు చేశాడు. విజయవాడ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడిక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నేరాలు చేశాడు.
 
 మెకానిక్ షెడ్‌లో కొత్త ఆలోచన!
‘దొంగల బడి’లోంచి బయటకు పంపేయడంతో కమలాకర్ తిరిగి విజయవాడకు చేరుకున్నాడు. ఓ రోజు జక్కంపూడిలోని ఓ మెకానిక్ షెడ్‌లో కూర్చున్నాడు. అక్కడి మెకానిక్ ఒక బైక్ ముందు చక్రాన్ని బాగుచేస్తుండగా.. ఫోర్క్ నుంచి కొన్ని చెర్రాలు (ఇనుప గుండ్లు) రాలిపడటం చూశాడు. అవేమిటని ప్రశ్నించిన కమలాకర్‌కు.. ఫోర్క్ నట్లు, బోల్ట్, చెర్రాలు చాలా కీలకమైనవని, అవి వదులైనా, రాలిపడినా ప్రమాదమని... వాటిల్లో ఎలాంటి తేడా గమనించినా వెంటనే రిపేరు చేయిస్తారని మెకానిక్ చెప్పాడు. ఈ వివరణలోంచి కమలాకర్‌కు కొత్త ఆలోచన పుట్టింది.. ఆ ‘ఫోర్క్’ పేరుతోనే దృష్టి మళ్లించడం మొదలుపెట్టాడు. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాలు, పట్టణాలు, రాష్ట్రంలోని హైదరాబాద్‌లో పంజా విసిరాడు.
 
 పంచేస్తాడు.. పేకాడేస్తాడు..
 కమలాకర్ పేరు చెబితే విజయవాడ సహా అంతటా పోలీసులు అప్రమత్తమైనా... అతను ఉండే కాలనీ మాత్రం అక్కున చేర్చుకుంటుంది. కమలాకర్ అరెస్టయిన ప్రతిసారీ బెయిల్ ఇచ్చేందుకు కాలనీ వారు పోటీపడుతుంటారు. కమలాకర్ చోరీ చేసిన సొత్తులో చాలా వరకు ఆ ప్రాంతంలో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించడమే దీనికి కారణం.

కొందరికి వైద్యం చేయించడం, మరికొందరికి వివాహానికి సాయం చేయడం, సెల్‌ఫోన్లు వంటివి విరివిగా దానం చేయడం వంటివి చేస్తుంటాడు. అవన్నీ చోరీ చేసినవే కావడం గమనార్హం. దీంతోపాటు కమలాకర్‌కు ఓ బలహీనత కూడా ఉంది. విజయవాడలోని కృష్ణానది మధ్యలో ఉన్న లంకల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేకాట శిబిరాలకు కమలాకర్ రెగ్యులర్‌గా వెళుతుంటాడు. ఆడినప్పుడల్లా చేతిలో ఉన్నది పోగొట్టుకోవడంతో పాటు అప్పులు తీసుకుంటాడు. మళ్లీ చోరీలు చేసి ఆ అప్పులు తీరుస్తాడు.

Advertisement
Advertisement