విజ్ఞాన ప్రపంచం - మేధస్సుకు పదును | Sakshi
Sakshi News home page

విజ్ఞాన ప్రపంచం

Published Sun, May 25 2014 8:29 PM

విజ్ఞాన ప్రపంచం - మేధస్సుకు పదును

 విశ్వ సమాచార సమ్మేళనం
 వినోదం, విజ్ఞానం  పంచుతున్న రీజనల్ సైన్స్ సెంటర్

(న్యూస్‌లైన్ -తిరుపతి-మంగళం)
 ఇదో విజ్ఞాన ప్రపంచం. అంతరిక్షంలో జరుగుతున్న అద్భుతాలను మన ముందుంచుంతోంది. జీవ, రసాయక, భౌతిక, గణిత, ఖగోళశాస్త్ర విశేషాలతో విద్యార్థుల మేధస్సుకు పదునుపెడుతోంది.  సైన్స్‌పై ఆసక్తి కలిగిస్తున్నాయి. పాపులర్ సైన్స్, ఫన్‌సైన్స్,  హిస్టారిక్ పార్క్, లైఫ్ పార్క్, త్రీడీ సినిమా సైన్స్ గ్యాలరీలు ఆకట్టుకుంటున్నారుు. ఉపగ్రహాలు, శాటిలైట్స్, భూ స్థిరకక్ష్య, గ్రహాలు, పర్యావరణం, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వంటి ఎగ్జిబిట్స్ విద్యార్థుల్లో నూతన ఆలోచనలను రేకెత్తిస్తున్నారుు. ఎమర్జింగ్   టెక్నాలజీ, భ్రమ, జ్ఞానేంద్రియాలు, విశ్వం వంటి   గ్యాలరీలతో పాటు సైన్స్ ఫర్ నక్షత్రశాల తదితరాలు    హైలెట్‌గా నిలుస్తున్నాయి. పెద్ద నగరాలకు మాత్రమే      పరిమితమైన ప్లానిటోరియం ఈ సైన్స్ సెంటర్‌లో  ఉండడం విశేషం. ఓ లుక్కేదాం రండి..        
                                                                                     -
 వేసవి సెలవుల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తోంది తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం. జీవ, రసాయనిక, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్ర విశేషాలతో విద్యార్థుల మేధస్సుకు పదునుపెడుతోంది . జిల్లాలోని విద్యార్థులే కాకుండా నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. విద్యార్థులకు విజ్ఞాన విశేషాలు అర్థమయ్యే రీతిలో సిబ్బంది వివరిస్తున్నారు. తిరుపతిలోని అలిపిరి మెట్ల దారికి 500 మీటర్ల దూరంలో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్‌లో విశేషాలు తెలుసుకుందాం..

 పాపులర్ సైన్స్ గ్యాలరీ

 అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి, ధ్వని ప్రయోగాలు, కాంతికి సంబంధించిన వివిధ రకాల ప్రయోగాలు, గణితం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను ఈ గ్యాలరీలోని ఎగ్జిబిట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

 ఫన్ సైన్స్ గ్యాలరీ

మనిషి ప్రతిబింబాన్ని అద్దంలో వివిధ ఆకారాలలో చూపించే దర్పణాలు, భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇతర శాటిలైట్స్, భూ స్థిరకక్ష, గ్రహాలు, పర్యావరణం, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వంటి విషయాలను ఈ గ్యాలరీలోని ఎగ్జిబిట్స్ వివరంగా తెలియజేస్తున్నాయి.

 ఎమర్జింగ్ టెక్నాలజీ

 మానవజీవితాన్ని శాసించే ఏడు ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల సైన్స్ మోడల్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయి. అందులో అంతరిక్ష, విజ్ఞానం, న్యూక్లియర్  టెక్నాలజీ, ఓషన్ టెక్నాలజీ, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నానాటెక్నాలజీలలో వచ్చిన సాంకేతిక మార్పులను సైన్స్ మోడల్స్‌లో చూడవచ్చు.

 భ్రమింపజేసే గ్యాలరీ

 ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే మనిషి మొండెం, తల వేరుగా కనిపిస్తాయి. మనిషి లేని చోట మాట్లాడే బొమ్మ ఉండి అందరితో మాట్లాడినట్లుగా భ్రమింపజేస్తుంది. ఒక అద్దంలో చూస్తే అస్తిపంజరం, మరో అద్దంలో ముఖం చూస్తే వీపు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్యాలరీలో పిల్లలతోపాటు పెద్దలు కూడా భ్రమపడడం ఖాయం.

 మన జ్ఞానేంద్రియాలు

 మానవశరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విజ్ఞానాన్ని తెలియజేసే గ్యాలరీ ఇది. చిన్న పిల్లలకు శరీర భాగాల వివరాలను బొమ్మలు, ప్రయోగాల ద్వారా తెలియజేయడం కొత్త విశేషం.

 విశ్వ సమాచారం

 అంతరిక్షంలో నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఎలా ఏర్పడ్డాయో ఈ గ్యాలరీ వివరిస్తుంది. శాటిలైట్స్ పనితనాన్ని కూడ ఇక్కడ తెలుసుకోవచ్చు. పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ప్లానిటోరియం ఇక్కడ ఉండడం విశేషం.

 అబ్బురపరిచే త్రీడీ షో...

 పిల్లల నుంచి పెద్దల వరకు అబ్బురపరిచే విధంగా సైన్స్‌సెంటర్‌లో ప్రత్యేక థియేటర్‌లో త్రీడీ షోను నిర్వహిస్తున్నారు. ఈ షో తిలకించేందుకు ప్రతి ఒక్కరికీ త్రీడీ అద్దాలు ఇస్తారు. సినిమాలోని సంఘటనలు పక్కనే జరిగినట్టుగా ఉండడంతో పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు.

 హిస్టారిక్ పార్క్

 వేల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన అద్భుత జీవజాలాల ప్రతిమలను ఈ హిస్టారిక్ పార్క్‌లో చూడవచ్చు. డైనోసార్, పురాతన ఏనుగులు, ఆదిమానవుడి జీవన విధానం వంటి అద్భుత ఆకృతులు పిల్లలకు ఆనందానిస్తున్నాయి. ఊయలలు, జారుడు బల్లలు వంటి ఆటవస్తులు అలరిస్తున్నాయి.

 ప్రవేశ రుసుం

 రీజనల్ సైన్స్‌సెంటర్‌ను సందర్శించేందుకు ప్రతి ఒక్కరూ రూ.5లు చెల్లించాలి.  ఏదైనా స్కూల్ విద్యార్థులంతా కలసి సైన్స్‌సెంటర్‌ను సందర్శించేందుకు ఒకొక్కరికీ కేవలం రూ.2లు మాత్రమే రుసుము వసూలు చేస్తున్నారు. రీజనల్ సైన్స్‌సెంటర్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు.

Advertisement
Advertisement