మూడో వన్డేలో అతనికి చాన్స్‌ ఇస్తాం: కోహ్లి | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలో అతనికి చాన్స్‌ ఇస్తాం: కోహ్లి

Published Mon, Jun 26 2017 8:55 AM

మూడో వన్డేలో అతనికి చాన్స్‌ ఇస్తాం: కోహ్లి

అంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగే మూడో వన్డేలో జట్టు కూర్పుపరంగా ప్రయోగాలు చేస్తామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపారు. మూడో వన్డేలో కొత్త కుర్రాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో తీసుకునే అవకాశముందని తెలిపాడు. ఐదు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో వన్డేలో ఘనవిజయం సాధించిన తర్వాత కెప్టెన్‌ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ‘జట్టు కూర్పు విషయంలో ఏమేం మార్పులు చేయాలో మేం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటిగ్వా మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేసే అవకాశముంది. కొందరికి తుదిజట్టులో అవకాశం దొరకొచ్చు’  అని చెప్పాడు.

కరీబియన్‌ పర్యటనలో భారత్‌ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో రెండో వన్డేలో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్‌ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్‌, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్‌ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్‌ జట్టు 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమైంది. యువ బౌలర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ తర్వాత అత్యధికమంది ఫాలో అవుతున్న వ్యక్తిగా తాను రికార్డు సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. మైదానంలో తమ ఆటతీరు వల్లే ఇలాంటివి సొంతమవుతాయని చెప్పాడు.

Advertisement
Advertisement