Sakshi News home page

పాల సముద్రాన్ని జయించారు!

Published Thu, Jan 9 2014 12:49 AM

పాల సముద్రాన్ని జయించారు! - Sakshi

  • రూ.2 లక్షల పెట్టుబడికి... రూ.1,750 కోట్ల విలువ
  •  తిరుమల డెయిరీ నలుగురు ప్రమోటర్లూ రైతు కుటుంబీకులే
  •  లాక్టాలిస్ కొనుగోలుతో కష్టానికి తగ్గ ప్రతిఫలం  
  •    రూ. 2 వేల కోట్ల టర్నోవర్‌కు చేర్చింది వారి క్వాలిటీయే
  •  18 ఏళ్ల కిందట కుటీర పరిశ్రమగా ఆవిర్భావం  
  •  ఇప్పుడు ప్రత్యక్షంగా పదివేలు.. పరోక్షంగా లక్ష మందికి పైనే ఊపాధి
  •  నక్కా మాధవరెడ్డి, నరసరావుపేట
    ఆ నలుగురూ టెక్నాలజీ నిపుణులేమీ కారు. బిజినెస్ డిగ్రీలు చదివిన వాళ్లూ కారు. వాళ్లు చేసిన వ్యాపారం సైతం ఎవరికీ తెలియనిదేమీ కాదు.  ఆవులు, గేదెల పాలను సేకరించటం. వాటిని విక్రయించటం. అంతే!

    మరి పోటీనో!!? అమూల్ వంటి కొమ్ములు తిరిగిన కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో కొనసాగుతున్న అగ్రశ్రేణి డెయిరీలెన్నో ఉన్నాయి. హెరిటేజ్ వంటి రాజకీయ నాయకుల సొంత సంస్థలూ ఉన్నాయి. అయినా వారు గెలిచారు. 2 లక్షల రూపాయలతో ఆరంభించిన కంపెనీని... రూ.1,750 కోట్లు పలికే స్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్ర పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
     
    తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్‌ను రూ.1,750 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ బుధవారం ప్రకటించింది. మరి ఆ తిరుమల మిల్క్స్ ఎవరిదో తెలుసా? గుంటూరు జిల్లాలో రైతు కుటుంబాలకు చెందిన ఓ నలుగురు స్నేహితులది. వారే బొల్లా బ్రహ్మనాయుడు, దండా బ్రహ్మానందం, డాక్టర్ నలబోతు వెంకట్రావు, బత్తిన నాగేశ్వరరావు. 1995 డిసెంబర్ 31న... తెల్లవారితో కొత్త సంవత్సరం వస్తుందనగా నలుగురూ కలిసి డెయిరీ పెట్టాలన్న ఆలోచన చేశారు. అప్పట్లో వారి దగ్గర పెద్ద పెట్టుబడేమీ లేదు. నలుగురూ కలిసి రూ.2 లక్షలు సమీకరించారు. ప్రకాశం జిల్లా వెల్లలచెరువు గ్రామంలో తిరుమల డెయిరీ ప్లాంట్‌ను ప్రారంభించారు. దాన్ని శీతలీకరణకు వినియోగించేవారు. పాల సేకరణ మొదలుపెట్టారు. గ్రామగ్రామాలకు తిరిగి రైతుల వద్దకు వెళ్ళి పాలను సేకరించేవారు. నిద్రాహారాలు మాని శ్రమించారు. మొదట్లో రోజుకు 10వేల లీటర్ల పాలు చొప్పున సేకరించేవారు. వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన రవిలీలా డెయిరీకి పంపేవారు.  
     
     అంతలోనే పిడుగుపాటు!
     కొన్నాళ్లు బాగానే గడిచింది. ఉన్నట్టుండి రవిలీలా డెయిరీ ఇబ్బందుల్లో పడింది. మరి సేకరించిన పాలనేం చేయాలి? పోనీ సేకరణ ఆపేద్దామంటే ఇక మొత్తం పోయినట్టే!! ఏం చేద్దాం? ఈ సమయంలో నలుగురూ కలిసి నష్టం భరించడానికే సిద్ధపడ్డారు. సేకరించిన పాలను మురుగు కాలువల్లో పారబోసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక లాభం లేదనుకుంటున్న సమయంలోనే... రూ.4.5 లక్షలు అప్పు చేసి  పాలల్లో వెన్న తీసే యంత్రాన్ని కొన్నారు. అయితే వెన్న తీసేశాక మిగిలిన పాలన్నిటినీ వృధాగా పారబోయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో అతి పెద్ద డెయిరీగా ఉన్న హెరిటేజ్‌తో ఒప్పందం కుదిరింది. కానీ అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలలకే ఆ ఒప్పందమూ రద్దయింది. దీంతో మద్రాసులోని రామాపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ప్యాకింగ్ చేస్తూ పాలను విక్రయించడం మొదలుపెట్టారు. సేకరించిన పాలన్నీ ప్యాకింగ్ చేసి అమ్మగలిగే స్థాయికి చేరారు. కానీ పరిస్థితులు తిరగబడ్డాయి. దాన్ని నడపలేక 1998లో అమ్మకానికి సిద్ధమయ్యారు.
     
     లారీలను తాకట్టు పెట్టి...
     మిగిలిన మిత్రులు అమ్మకానికి మొగ్గు చూపినా... అప్పట్లో డెయిరీ ఎండీగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తనకున్న లారీలను, ఇంట్లోని బంగారు నగలను తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో 1998లో గూడూరులో సొంత ప్యాకింగ్ యూనిట్‌ను ఆరంభించారు. అదే తిరుమలకు టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి ఇక కంపెనీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పాలల్లో వారు చూపించిన క్వాలిటీ... దక్షిణాది రాష్ట్రాల్లో తిరుమల మిల్క్‌కు ఒక ప్రత్యేకతను సంపాదించిపెట్టింది. అప్పటికే వేళ్లూనుకున్న పెద్ద పెద్ద డెయిరీలన్నీ తిరుమల ధాటికి కంగుతిన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే తిరుమల పాల కోసం నాలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. గూడూరు తరవాత వరసగా బెంగళూరు, హైదరాబాదు, బీమడోలు, అనకాపల్లి, విశాఖపట్నం, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ వంటి పలు ప్రాంతాల్లో తిరుమల డెయిరీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పాల అమ్మకాలతో పాటు పాల ఉత్పత్తులనూ విక్రయించటం మొదలుపెట్టారు. ఇందులో హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తిరుమల డెయిరీ ప్లాంట్... దేశంలోనే అతి పెద్ద ప్లాంట్ కావటం విశేషం. ప్రస్తుతం తిరుమల డెయిరీ రోజుకు 12 లక్షల లీటర్ల పాలతో పాటు 2 లక్షల లీటర్ల పాలపొడి, 2 లక్షల లీటర్ల పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. గతేడాది సంస్థ టర్నోవర్ సాక్షాత్తూ 1,425 కోట్లు. ఈ ఏడాది 2వేల కోట్లు దాటొచ్చనేది యాజమ్యాం ధీమా.
     
     పాల ఉత్పత్తి కల నెరవేరలేదు...

     ఇన్ని చేసినా... పాల ఉత్పత్తిని కూడా తామే చేపట్టాలన్న ప్రమోటర్ల కోరిక మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. రూ.5వేల కోట్లతో గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో భారీ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడ 1000 ఎకరాలు కొనుగోలు చేయటంతో పాటు... 25వేల ఆవులను కొనుగోలు చేయడానికి కూడా ప్రణాళికలేశారు. తద్వారా పాల పదార్థాల ఎగుమతిలో అంతర్జాతీయ స్థాయికి చేరాలనుకున్నారు. అయితే ఇందుకోసం న్యూజిలాండ్ నుంచి పశువులను దిగుమతి చేసుకోవాల్సి రావటం... వైరస్ వ్యాప్తి భయంతో ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించటం... ఇవన్నీ ఆ కలను నెరవేరనివ్వలేదు. ఈ యూనిట్‌తో పాటే అక్కడ ఆసుపత్రి నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనుకున్నామని, అది కూడా నెరవేరలేదని ఇటీవలిదాకా కంపెనీకి ఎండీగా వ్యవహరించిన బ్రహ్మనాయుడు ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. మొత్తమ్మీద ఇపుడు తిరుమల డెయిరీకి రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలున్నాయి. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో డెయిరీ పార్లర్‌లున్నాయి. వీటిద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటీవల ఆయన రాజీనామా చేయగా... ఆయన స్థానంలో మరో డైరక్టర్ దండా బ్రహ్మానందం ఆ బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement