అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో.. | Sakshi
Sakshi News home page

అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో..

Published Fri, Sep 23 2016 4:39 PM

అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో..

గుజరాత్‌లో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ రాష్ట్రంలో ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో గ్రామీణులను, వ్యవసాయదారులను పెళ్లి చేసుకోవడానికి మహిళలు నిరాకరిస్తున్నారు. గుజరాత్‌లో 25-34 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారిలో ప్రతి ఇద్దరు అవివాహితులకు, ఏడుగురు పెళ్లికాని యువకులు ఉన్నారు. 25 ఏళ్లకు పైబడిన వారిలో మొత్తం 17.75 లక్షల మంది పెళ్లికాని యువతీయువకులు ఉన్నారు.

మగపిల్లలతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గిపోతుండటమే ఈ సమస్యకు కారణం. 1981లో ప్రతి 1000 మంది బాలురుకు 947 మంది బాలికలు ఉండేవారు. అదే 2011 నాటికి బాలికల నిష్పత్తి 886కి తగ్గింది. ఇక గుజరాత్‌​లో పోర్‌బందర్‌ ప్రాంతంలోనే పెళ్లికాని యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా కులాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఉన్నత విద్యావంతులుకావడంతో, చదువులేని యువకులను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గత దశాబ్దకాలంలో లేట్‌ మ్యారేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

పోర​బందర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ పటేల్‌కు 34 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ఓ పెళ్లి సంబంధం చూస్తే పోర్‌బందర్‌కు మారాలని పెళ్లికూతురు తరఫువారు షరతు పెట్టారని, తాను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకుని కావడంతో వ్యవసాయంతో​ పాటు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఊరు విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో తనను వివాహం చేసుకునేందుకు ఆ అమ్మాయి నిరాకరించిందని రమేష్‌ చెప్పాడు. గుజరాత్‌లో రమేష్‌ లాంటి పెళ్లికాని యువకులు లక్షలాదిమంది ఉన్నారు.

Advertisement
Advertisement