నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం! | Sakshi
Sakshi News home page

నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!

Published Wed, Oct 14 2015 10:00 AM

నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!

- సుభాష్ చంద్రబోస్ ను  భారత్ రప్పించేందుకు రష్యన్లతో చర్చలు
-  లాల్ బహదూర్ శాస్త్రి మనవడి తాజా వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారా? ఆయనను భారత్కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారా? శాస్త్రీజీ తాష్కెంట్ (నాటి రష్యన్ యూనియన్లోని) పర్యటన వెనుక సిమ్లా ఒప్పందమే కాక మరో ఉద్దేశం కూడా ఉందా? ఇప్పటికే ఈ కోణంలో పలు విషయాలు వెలుగులోకి రాగా, బుధవారం లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థ సింగ్ వెల్లడించిన అంశాలు మరింత సంచలనం కలిగించాయి.

'ఒక ముఖ్య వ్యక్తిని తిరిగి రప్పించేందుకు మా తాత (లాల్ బహదూర్ శాస్త్రి) సోవియెట్ యూనియన్కు చెందిన కీలక వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారని మా నాన్న ద్వారా తెలిసింది' అని సిద్ధార్థ్ సింగ్ మీడియాకు చెప్పారు. ముఖ్యవ్యక్తి పేరేంటో చెప్పలేదు గానీ, దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి అని కూడా చెప్పడంతో.. అది నేతాజీయేనని తాము అర్థం చేసుకున్నామన్నారు. శాస్త్రీజీ.. నేతాజీని ఎంతగానో ఆరాధించేవారని, బోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లు వెల్లడించి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సిద్ధార్థ అన్నారు.

గతంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై తమకు అనుమానాలున్నాయని,  తాష్కెంట్లో చోటుచేసుకున్న సంఘటనల పూర్వాపరాలు వెల్లడించాలని శాస్త్రి కుటుంబసభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నేతాజీని తిరిగి భారత్ రప్పిస్తున్న ప్రయత్నాలు చేయడం వల్లే తాష్కెంట్ లో శాస్త్రీజీపై విషప్రయోగం జరిగిందని కాంగ్రెస్ బద్ధవ్యతిరేకులు కొందరు వదంతులు సృష్టించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

Advertisement
Advertisement