ఎన్నికల ప్రచారంలో ఇద్దరు మాజీ సీఎంలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో ఇద్దరు మాజీ సీఎంలు

Published Mon, Aug 11 2014 2:01 PM

ఎన్నికల ప్రచారంలో ఇద్దరు మాజీ సీఎంలు - Sakshi

పాట్నా:రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరంటారు. బీహారీ రాజకీయాలు చూస్తే ఆ విషయం మరోసారి తెలుస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బద్ధ శత్రువులుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ గత నెల్లోనే చేతులు కలిపారు. త్వరలో బీహార్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా వైషాలి జిల్లాలోని హజ్ పురీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇద్దరూ ఒకే వేదికపై మరోసారి ఆలింగనం చేసుకున్నారు.1993లో జనతా పార్టీ నుంచి విడిపోయి నితీష్ కుమార్ సమతా పార్టీలో చేరిన తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరి మధ్యే అధికారం దోబూచులాడుతూ వచ్చింది. కానీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో బీహార్లో ఉన్న మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 31 స్థానాలు గెలుచుకుంది. దాంతో బద్ధ శత్రువులిద్దరూ మళ్లీ చేతులు కలపకపోతే ఇక మనుగడ ఉండదనుకున్నారు. అందుకే 1990 తర్వాత మొదటిసారి ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

ఈ మధ్యనే బీజేపీ కూడా ఈ మాజీ సీఎంలపై విరుచుకుపడుతోంది. బీహార్ లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా ఈ మధ్య ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశంలో వ్యాఖ్యానించారు.త్వరలో బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఆర్జేడీ, జేడీయూ తలో నాలుగు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు పోటీ చేస్తాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే, మిగిలిన పక్షాలన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోడానికి సిద్ధమైపోయాయన్న మాట. 2010లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న పది అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింటిలోబీజేపీ గెలిచింది. మూడింటిని ఆర్జేడీ, ఒక స్థానాన్ని జేడీ (యూ) సాధించాయి. ఈ మైత్రి ఎన్నాళ్లు సాగుతుందో.. ఎంతమేరకు ఫలితాలిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement