Sakshi News home page

హస్తినలో విడివిడిగా.. పాటలీపుత్రలో కలివిడిగా..

Published Fri, Jun 23 2017 8:28 PM

హస్తినలో విడివిడిగా.. పాటలీపుత్రలో కలివిడిగా..

- లాలూ ఇఫ్తార్‌ విందుకు నితీశ్‌
- బిహార్‌ మహాకూటమికి ఢోకాలేదన్న ఇరు నేతలు
- జేడీయూ, ఆర్జేడీల మధ్య చల్లారిన ‘రాష్ట్రపతి’ చిచ్చు


పట్నా:
బేదాభిప్రయాలు పక్కనపెట్టి ఇద్దరు మిత్రులు ఒక్కటయ్యారు. ఇఫ్తార్‌ విందు చేసుకుని శుభసంకేతాలిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో ఎవరికివారే అన్న చందంగా వ్యవహరించిన మిత్రద్వయం నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు ఒకే వేదికపై చేరారు. ఢిల్లీలో విడివిడిగా ఉన్నా, బిహార్‌ విషయంలో మాత్రం కలివిడిగానే ఉంటామని ప్రకటించారు.

శుక్రవారం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నివాసంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీల మహాకూటమికి ఢోకాలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌(జేడీయూ).. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలపగా, లాలూ యాదవ్‌(ఆర్జేడీ) మాత్రం మీరా కుమార్‌కు జై కొట్టిన సంగతి తలిలిసిందే. అందరికంటే ముందు కోవింద్‌కు మద్దతు తెలిపిన నితీశ్‌.. చరిత్రాత్మక తప్పిదమని లాలూ వ్యాఖ్యానించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. నితీశ్‌.. మహాకూటమి నుంచి బయటికి వచ్చేసి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వన్ని నడుపుతారనే చర్చ నడిచింది. లాలూ కుటుంబంపై ఈడీ దాడులు కూడా అందులో భాగమేనని విమర్శలు వినిపించాయి. కానీ నేటి కలయికతో మేం ఒక్కటేనని చాటుకున్నారా నేతలు.

Advertisement
Advertisement