సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఆ టెర్రర్‌ గ్రూప్‌ కకావికలం! | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఆ టెర్రర్‌ గ్రూప్‌ కకావికలం!

Published Sun, Oct 9 2016 4:56 PM

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఆ టెర్రర్‌ గ్రూప్‌ కకావికలం!

బరాముల్లా/న్యూఢిల్లీ: భారత సైన్యం అత్యంత పకడ్బందీగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చావుదెబ్బ తిన్నది. వాస్తవాధీన రేఖ ఆవల ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద తాత్కాలిక శిబిరాలపై భారత సైన్యం గత నెల 29న మెరుపు దాడుల్లో చేసింది. ఈ దాడుల్లో ఒక్క ఎల్‌ఈటీకే 20మంది ఉగ్రవాదులు హతమయినట్టు వివిధ నిఘా వర్గాల నివేదికలను బట్టి తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు చెందిన వివిధ వర్గాల రేడియో సంభాషణలపై నిఘా సమాచారం, ఆర్మీ యూనిట్ల సమాచారం ప్రకారం సర్జికల్‌ దాడుల్లో ఎల్‌ఈటీ దారుణంగా నష్టపోయింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సెక్టర్‌కు అభిముఖంగా పీవోకేలో ఉండే డుద్‌నియాల్‌ వద్ద ఎల్‌ఈటీ ల్యాంచ్‌ప్యాడ్‌పై సైన్యం దాడులు జరిపింది. కెల్‌, కైల్‌ అని కూడా పిలిచే ఇక్కడ ఆర్మీ డివిజన్‌కు చెందిన ఐదు బృందాలు దాడులు జరిపాయి. పాకిస్థాన్‌ సైన్యం రక్షణలో ఎల్‌వోసీకి ఏడు వందల మీటర్ల దూరంలో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌ ఉంది. ఇక్కడ అత్యధికంగా ఎల్‌ఈటీ ఉగ్రవాదులే ఉన్నారు. భారత సైన్యం చర్యను ఊహించలేకపోయిన ఉగ్రవాదులు.. సర్జికల్‌ దాడులతో షాక్‌ తిన్నారు. ప్రాణ రక్షణ కోసం పాక్‌ సైన్యం ఉన్న దిశగా పరుగులు పెట్టారు. వారు తప్పించుకునేలోపే భారత సైన్యం తన పని పూర్తి చేసింది.

విశ్వసనీయ వర్గాల ప్రకారం సర్జికల్‌ దాడులు ముగిసిన అనంతరం ఆర్మీ రేడియో సంభాషణలపై నిఘా పెట్టింది. ఈ నిఘా సమాచారం ప్రకారం ఇక్కడ కనీసం పది మంది ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతమైనట్టు పాక్‌ ఆర్మీ సంభాషణల్లో తేలింది. ఆ రోజు తెల్లవారుజామునే మృతదేహాలను తరలించి నీలమ్‌ వ్యాలీలో సామూహికంగా ఖననం చేసినట్టు వెల్లడైంది. ఇక పూంచ్‌ సెక్టర్‌కు అభిముఖంగా ఉన్న బాల్నోయ్‌ ప్రాంతంలో సైన్యం జరిపిన సర్జికల్‌ దాడుల్లో తొమ్మిది మంది వరకు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఇద్దరు పాకిస్థానీ సైనికులు కూడా మృతిచెందారు. వివిధ మార్గాల్లో దేశంలోకి చొరబడేందుకు ఈ ఉగ్రవాదులు ఎల్‌వోసీ మీదుగా మాటువేశారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, దేశంలో ఉగ్ర దాడులు జరిపేందుకు సన్నద్ధమవుతున్న వారిని పీవోకేలోకి ప్రవేశించి మెరుపు దాడుల ద్వారా సైన్యం మట్టుబెట్టిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement