Sakshi News home page

నాయకుల మరణాలే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రచారాస్త్రాలు

Published Mon, Nov 18 2013 12:38 PM

Leaders' deaths high on chhattisgarh Congress poll agenda

కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, నాటి ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, పార్టీ అగ్రనాయకుడు, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ.. ఇలా అనేక మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టులు గతంలో చేసిన దాడిలో మరణించారు. సుక్మా ప్రాంతంలో దాదాపు 250 మంది మావోయిస్టులు మాటువేసి చేసిన భారీ దాడిలో సుమారు 30 మంది నాయకుల ప్రాణాలు పోయాయి. ఇలా అగ్రనాయకత్వం మొత్తం దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో మంగళవారం జరగనున్న రెండోదశ ఎన్నికల్లో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ నానా కష్టాలు పడుతోంది. నాటి సంఘటనను ఇప్పుడు ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు తమ పార్టీ త్యాగాలు చేస్తూనే ఉందని ప్రచారం సందర్భంగా ఊదరగొట్టింది. మంగళవారం నాటి రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.

2003 నుంచి ఛత్తీస్గఢ్లో విపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా అధికార బీజేపీ నుంచి గట్టిపోటీయే ఎదుర్కొంటోంది. దీంతో నాయకుల మరణం సంఘటనను పావుగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. 'మా నాయకత్వం మొత్తం ఒకే ఒక్క సంఘటనతో తుడిచిపెట్టుకుపోయింది. అక్కడేం జరిగిందో ఇప్పటికీ ఎవపరికీ తెలియదు" అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ర్యాలీలో అన్నారు. జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదం కంటే ఇక్కడే ఎక్కువ హింస, భయం ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుల త్యాగాలను ప్రజలు మరువకూడదని పీసీసీ అధ్యక్షుడు చరణ్ దాస్ మహంత్ కూడా పదే పదే ర్యాలీలలో చెప్పారు. మోతీలాల్ వోరా, మొహసినా కిద్వాయ్, శ్రీకాంత్ జెనా, భక్తచరణ్ దాస్ లాంటి సీనియర్ నాయకులంతా సుక్మా సంఘటనను ప్రస్తావించారు.

Advertisement
Advertisement
Advertisement