2013లో డీల్ మార్కెట్ డీలా | Sakshi
Sakshi News home page

2013లో డీల్ మార్కెట్ డీలా

Published Sat, Jan 4 2014 2:13 AM

2013లో డీల్ మార్కెట్ డీలా

ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న బలహీనతలను అద్దం పడుతూ 2013లో డీల్ మార్కెట్ డీలా పడింది. దేశీయ కంపెనీలకు సంబంధించిన దేశ, విదేశీ కొనుగోళ్లు, విలీనాల కార్యకలాపాలు మందగించి 31.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 12% తక్కువకాగా, 2009లో మాత్రమే ఇంతకంటే తక్కువ స్థాయిలో 21.5 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరిగాయి. థామ్సన్ రాయిటర్స్ రూపొందించిన వివరాల ప్రకారం డీల్స్ పరిమాణం సైతం దాదాపు 13% తగ్గింది. 2012లో 1,107 డీల్స్ నమోదుకాగా, 2013లో 967కు పరిమితమయ్యాయి. నాలుగో క్వార్టర్‌లో జరిగిన డీల్స్ విలువ 7.1 బిలియన్ డాలర్లుకాగా, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 30% తగ్గాయి. అయితే మూడో క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం  29% అధికం.
 
 సగటు పరిమాణం ఓకే
 గతే డాదితో పోలిస్తే డీల్స్ సగటు పరిమాణం 2013లో 7.61 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో ఇది 7.35 డాలర్లుగా నమోదైంది. దేశీయ విలీనాలు, కొనుగోళ్లపై ఆర్థిక మందగమనం భారీ ప్రభావాన్నే చూపింది. దీంతో దేశీయ డీల్స్ 69% క్షీణించి 5.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతంలో 2004లో మాత్రమే ఇంతకంటే తక్కువగా 2 బిలియన్ డాలర్ల డీల్స్ జరిగాయి. వీటిలో అధిక శాతం అంటే 1.5 బిలియన్ డాలర్ల డీల్స్ మెటీరియల్స్ రంగంలో నమోదయ్యాయి. మొత్తం దేశీయ డీల్స్ పరిమాణంలో ఇవి 29.4%కు సమానం. అయితే గతేడాదితో పోలిస్తే ఈ రంగంలో జరిగిన డీల్స్ 75.4% తక్కువ. కాగా, మరోవైపు ఇదే కాలంలో దాదాపు 57% అధికంగా 24.7 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ డీల్స్ జరిగాయి. దేశీయ కంపెనీలకు సంబంధించిన డీల్స్ 49.5% పుంజుకుని 19.4 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాదిలో ఇవి 19.4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇంధనం, విద్యుత్ రంగాల విలీనాలు, కొనుగోళ్లు 173% పెరిగి రూ. 6.7 బిలియన్ డాలర్లకు చేరగా,  హెల్త్‌కేర్ కంపెనీల డీల్స్ దాదాపు 25% ఎగసి 5 బిలియన్ డాలర్లను తాకాయి.

Advertisement
Advertisement