పిల్లల రక్తాన్ని పిండుకుంటున్న జంట | Sakshi
Sakshi News home page

పిల్లల రక్తాన్ని పిండుకుంటున్న జంట

Published Mon, Aug 10 2015 4:29 PM

పిల్లల రక్తాన్ని పిండుకుంటున్న జంట

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో భార్యాభర్తలైన ఓ డాక్టర్ల జంట పిల్లల రక్తాన్ని పిండుకుంటోంది. చట్ట నిబంధనలన్నింటిని ఉల్లంఘించి ఎనిమిదేళ్ల ప్రాయం కూడా సరిగ్గా నిండని మైనర్ల నుంచి పదే, పదే రక్తం తీసి అంగట్లో అమ్ముకుంటోంది. ఇప్పటి వరకు కనీసం పది వేల మంది పిల్లల్ని నుంచి రక్తాన్ని అక్రమంగా సేకరించడం వల్ల దాదాపు నాలుగు కోట్ల రూపాయలను సంపాదించినట్లు ఉన్నతాధికారుల దాడిలో వెలుగు చూసింది. పిల్లల బ్లడ్ గ్రూప్ ఏదనే విషయాన్ని తేల్చుకోవడానికి తప్ప మరే ఇతర ఇన్‌ఫెక్సన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు ఎలాంటి రక్త పరీక్షలు నిర్వహించక పోవడం మరో ఘోరమైన విషయం.

డాక్టర్ వీకే కోహ్లీ, డాక్టర్ చిత్రా కోహ్లీ యజమానులుగా ఉన్న నగరంలోని కాంచన్ మార్కెట్ వద్దగల ఓ పాథలాజికల్ ల్యాబ్‌పై బాధితుల తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సిటీ మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ మిశ్రా, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ సమక్షంలో ఏరియా సర్కిల్ ఇనిస్పెక్టర్ సర్వేష్ కుమార్ మిశ్రా ఇటీవల దాడులు నిర్హహించగా డాక్టర్ల జంట రక్తపు దందా వెలుగు చూసింది. వైద్యాధికారుల స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు దాతల పేర్లకు బదులుగా నకిలీ పేర్లు నమోదు చేస్తున్నారు. ఒక్కో మైనర్ నుంచి వరుసగా మూడు రోజులు రక్తాన్ని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

గత ఆరు ఏళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న ఈ దందాలో బాధితులకు కేవలం పది లక్షల రూపాయలు చెల్లించగా, వారి రక్తాన్ని అమ్ముకోవడం ద్వారా ఈ డాక్టర్ల జంట దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఆర్జించినట్లు ఉన్నత వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ కోహ్లీ జంట పాథలోజికల్ ల్యాబ్‌తోపాటు ‘కోహ్లీ బ్లడ్ బ్యాంక్ అండ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ని నడుపుతున్నారు.

డబ్బు ఎరచూపి పిల్లల రక్తాన్ని పిండుకోవడానికి ఈ జంట బ్రోకర్లను కూడా నియమించుకుంది. బ్రోకర్ల బుట్టలో పడుతోంది ఎక్కువగా నిరుపేద కుటుంబాల పిల్లలే. ల్యాబ్ మేనేజర్ వీకే భట్నాగర్, ల్యాబ్ టెక్నీషియన్ శాంతారాం యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేసి, ల్యాబ్‌ను సీజ్ చేశారు.

ల్యాబ్ యజమానులైన కోహ్లీ దంపతులు అమెరికా పర్యటనకు వెళ్లినట్లు తెల్సిందని, వారు రాగానే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు. తమ తల్లిదండ్రులకు తెలియకుండానే తాము రక్తం ఇచ్చామని, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకే తాము రక్తం అమ్ముకోవాల్సి వచ్చిందిన ఎక్కువ మంది బాధిత బాలబాలికలు తెలిపారు.

Advertisement
Advertisement