ప్రేమి'కుల'కు భరోసా | Sakshi
Sakshi News home page

ప్రేమి'కుల'కు భరోసా

Published Thu, Apr 14 2016 3:30 AM

ప్రేమి'కుల'కు భరోసా - Sakshi

* పరువు హత్యలపై హైకోర్టు కన్నెర్ర
* ఇక భద్రతకు భరోసా కీలక ఆదేశాలు జారీ
* జిల్లాకో ప్రత్యేక విభాగం
* తాత్కాలిక ఇళ్ల నిర్మాణానికి చర్యలు

సాక్షి, చెన్నై: కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు మద్రాసు హైకోర్టు అండగా నిలిచింది. పరువు హత్యలపై కన్నెర్ర చేసింది. ఈ ప్రేమికుల భద్రతకు భరోసా ఇస్తూ, ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో పలు సామాజిక వర్గాల అధికారులతో ఈ బృందాలు మూడు నెలల్లోపు ఏర్పాటు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా కులాంతర ప్రేమవివాహాలు పరువు హత్యలకు దారి తీస్తూ వస్తున్నాయి.

2003 నుంచి ఇప్పటి వరకు వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ కులాంతర ప్రేమ వివాహాలకు ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, గత నెల ఉడుమలైలో శంకర్ బలి అయ్యారు. తెలిసి వందల గణాంకాలు ఉంటే, తెలియకుండా తెర మరుగులో సాగిన హత్యలు మరెన్నో వందల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఈ పరువు హత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్నా అడ్డుకట్ట వేసే వారెవ్వరు లేరన్న విమర్శలు ఉన్నాయి. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో వందలా మంది చూస్తుండగా, గత నెల అతి కిరాతకంగా ఘాతకం జరగడం రాష్ట్రంలో కలకలాన్ని రేపింది.  

అదే సమయంలో గతంలో తన ప్రేయసిని పరువు హత్య చేశారంటూ దిలీప్ కుమార్ అన్న ప్రియుడు కోర్టుకు ఎక్కి ఉండడం, తాజాగా చోటు చేసుకున్న హత్యల్ని పరిగణలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు, ఇక, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు  తాము అండగా ఉంటామన్న  భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందు కోసం ప్రత్యేకంగా విభాగాలు, కఠిన నిర్ణయాలు, భద్రతకు భరోసా ఇచ్చే ఆదేశాలు జారీ అయ్యాయి.
 
కన్నెర్ర, కొత్త ఆదేశాలు: 2014లో ఉసిరికి చెందిన విమలదేవి, దిలీప్ కుమార్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు కేరళలో కొత్త కాపురం పెట్టారు. అయితే, ఈ ఇద్దరూ కన్పించడం లేదన్న ఫిర్యాదులు పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎట్టకేలకు ఆ ఇద్దర్నీ పట్టుకొచ్చిన పోలీసులు ఓ శాసనసభ్యుడి సమక్షంలో పంచాయతీ పెట్టి విడదీశారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, విమల దేవి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆమె మృత దేహాన్ని ఆగమేఘాలపై దహనం చేయడంతో దిలీప్ కుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో విమల దేవి పరువు హత్యకు బలైనట్టు తేలింది.

ఈ కేసు విచారణ సీబీఐ పర్యవేక్షణలో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం పిటిషన్ న్యాయమూర్తి రామసుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరువు హత్యలు, కులాంతర వివాహాలను పరిగణలోకి తీసుకున్న బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ హత్యలకు అడ్డుకట్ట వేద్దామని, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రతను కల్పిద్దామని పేర్కొంటూ, ఇందు కోసం జిల్లాకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు కావాలని ఆదేశించారు.

జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో ఆది ద్రావిడ, సమాజ సంక్షేమ తదితర విభాగాల అధికారులు నియమించాలని, ఈ విభాగాలు 24 గంటలూ పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు భద్రత కల్పించాలని ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికులు,  దంపతులు ఆశ్రయిస్తే వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ విభాగానిదేనని వివరించారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలని సూచించారు. ఈ విభాగానికి వచ్చే ఫిర్యాదులు, దంపతులకు, ప్రేమికులకు కల్పించిన భద్రత, తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్‌లో పొందు పరచాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే,  ఈ విభాగం కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించాలని, ఈ విభాగం ద్వారా తాత్కాలిక గృహాల్ని నిర్మించి కులాంతర వివాహాలు చేసుకునే దంపతులకు నీడను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కౌన్సిలింగ్, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపడం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, పెద్దలు అంగీకరిస్తే, వారి వెంట పంపించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రేమికుల్ని పంచాయతీ పెట్టి విడదీయడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు పోలీసులపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

Advertisement
Advertisement