'మారణ హోమం సృష్టిస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'మారణ హోమం సృష్టిస్తున్నారు'

Published Fri, Jul 18 2014 9:52 AM

'మారణ హోమం సృష్టిస్తున్నారు'

రష్యన్‌ వేర్పాటు వాదులు ఉక్రెయిన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు హింసతో పాటు, నిత్య మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు.  గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు.  ఉక్రెయిన్లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ను ఆందోళనల ద్వారా గద్దె దించేసిన తర్వాత రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులోని కొంత భూభాగాన్ని రష్యా ఇటీవల స్వాధీనం చేసుకుంది.

ఆక్రమించుకున్న ప్రాంతం నుంచే పంజా విసురుతున్న వేర్పాటు వాదులు నెత్తుటి వ్యూహాలతో రక్త చరిత్రను లిఖిస్తున్నారు.  ఎంహెచ్ 17 విమానం నేలకొరిగిన గ్రాబోవో కూడా రష్యన్‌ వేర్పాటు వాదుల ఆధీనంలో ఉంది. దీంతో గగనతలం నుంచి దాడులు చేస్తున్నారనే అనుమానంతో సాయుధ తిరుగుబాటు దళాలే విమానాన్ని పేల్చేసి ఉంటారని సర్వత్రా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ గగనతలం కూడా ప్రమాదకరంగా మారిపోయింది.

కాగా ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం గురువారం సాయంత్రం రష్యా సరిహద్దులో యుద్ధరంగంగా మారిన ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది సిబ్బందితోపాటు మొత్తం 295 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మలేసియాకే చెందిన ఎంహెచ్ 370 విమానం  మార్చిలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం.
 

Advertisement
Advertisement