మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు 16కు వాయిదా | Sakshi
Sakshi News home page

మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు 16కు వాయిదా

Published Mon, Nov 11 2013 4:08 AM

Maldives presidential polls postponed again, run-off on November 16

మాలే: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల తుది అంకం వారంపాటు వాయిదా పడింది. శనివారం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ అవసరమైన మెజారిటీ(50 శాతం ఓట్లు) రాకపోవడంతో ఆదివారం మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎన్నికలు జరిగిన మరుసటిరోజే మళ్లీ ఎన్నికలు జరిపితే ప్రజల రాజ్యాంగ హక్కులను బలహీనపరచినట్లవుతుందని కోర్టు ఆదివారం వేకువజామున ఇచ్చిన తీర్పులో పేర్కొంది.
 
 శనివారం నాటి ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధినేత, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌కు 46.4 శాతం, మాల్దీవ్స్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఆయన సమీప ప్రత్యర్థి అబ్దుల్లా యామీన్‌కు 30.3 శాతం, జుమ్‌హూరీ పార్టీ అభ్యర్థి గాసిమ్ ఇబ్రహీమ్‌కు 23.4 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తన మద్దతుదారులు నషీద్, యామీన్‌లలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని ఇబ్రహీం కోర్టును కోరారు. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సెప్టెంబర్ 7 నాటి ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికీ పూర్తి మెజారిటీ రాకపోవడం తెలిసిందే. కాగా, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఆదివారంతో పూర్తయింది కనుక అధ్యక్ష స్థానంలో ఉన్న మహమ్మద్ వహీద్ పాలనలో ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఆయన రాజీనామా చేయాలని నషీద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వహీదే అధ్యక్షుడిగా కొనసాగాలని సుప్రీంకోర్టు శనివారం సూచించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement