ప్రత్యేక హోదా కోసం మరో ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం మరో ఆత్మహత్య

Published Fri, Aug 28 2015 3:40 AM

ఆర్.లక్ష్మయ్య రాసిన సూసైడ్ నోట్ - Sakshi

హోదారాకపోతే ఉద్యోగాలు రావనే బెంగతో నెల్లూరులో లక్ష్మయ్య ఆత్మహత్య
* ఔట్‌సోర్సింగ్‌పై వాచ్‌మన్‌గా ఉద్యోగం చేస్తున్న లక్ష్మయ్య
* గత ప్రభుత్వ హయాంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల రద్దు
* ప్రత్యేకహోదా వస్తే తనకూ, కుమారుడికి ఉద్యోగాలు వస్తాయని కలలుగన్న లక్ష్మయ్య
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కప్పదాటు వైఖరితో మనస్తాపం
* ప్రత్యేకహోదా రాదన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో నైరాశ్యం
* హోదా రాకపోతే తమ బాధలు తీరవని భార్యతో వ్యాఖ్యలు

* గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య
* రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. నిరుద్యోగ సమస్య తీరాలంటూ లేఖ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ నెల్లూరు క్రైం: ప్రత్యేకహోదాకోసం మరో బలిదానం. తిరుపతిలో మునికోటి బలిదానం మరవకముందే... పామర్రులో సుబ్బారావు, కైకరంలో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నాలు కళ్లముందు కదలాడుతుండగానే... నెల్లూరులో లక్ష్మయ్య ఆత్మత్యాగం చేశారు. ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కప్పదాటు వైఖరికి విసిగివేసారి ఓ వికలాంగుడు గురువారం తనువు చాలించాడు. తన స్వార్థప్రయోజనాలకోసం ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో...

ప్రత్యేకహోదా రాకుంటే ఉద్యోగాలు రావన్న నిరాశ నిస్పృహలతో తెల్లవారు జామునే తన బతుకు తెల్లార్చుకున్నాడు. ‘జై ప్రత్యేకహోదా.. జై జై ప్రత్యేకహోదా. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ సమస్య తీరాలి. ఇది నాయొక్క మరణ వాగ్మూలం’ అని లేఖరాసి తన ప్రాణత్యాగంతో జాతిని జాగృతం చేసే ప్రయత్నంచేశాడు. స్థానికుల కథనం మేరకు... నెల్లూరుజిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపల్లికి చెందిన రామిశెట్టి లక్ష్మయ్య (55) పొట్టకూటికోసం నెల్లూరుకు వలసవచ్చారు.

హౌసింగ్‌బోర్డులో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై వాచ్‌మన్‌గా పనిచేస్తూ... పొదుపుగా కుటుంబాన్ని నడుపుకుంటూ కేశవులనగర్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఆ స్థలం వివాదంలో ఉండటంతో పొదలకూరురోడ్డు వాటర్‌ట్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుమార్తె ప్రవీణకు వివాహం చేయగా, కుమారుడువెంకటేశ్వర్లు ఓ దినపత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నారు.

గతంలో ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సమయంలో లక్ష్మయ్య ఉద్యోగం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తే తిరిగి తనకు, తన కుమారుడికి ఉద్యోగాలు వస్తాయని, కుటుంబం సంతోషంగా ఉంటుందని కలలుగన్నారు. అందుకే ప్రతి రోజూ ప్రత్యేక హోదా విషయం గురించి ఆరా తీసేవారు. అయితే ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కప్పదాటు వైఖరిని, మోసపూరిత ప్రకటనలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకహోదా రాదన్నట్లుగా మాట్లాడటంతో తీవ్రంగా కలతచెందాడు.

ఇక తమకు ఉద్యోగాలు రావని, దారిద్య్రం నుంచి బయటపడేది లేదని భార్య విజయమ్మవద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రతిరోజూలాగే బుధవారం రాత్రి కూడా కేశవులనగర్‌లో ఉన్న సొంత నివాసంలో నిద్రించేందుకు భార్యకు చెప్పి వచ్చాడు. ప్రత్యేకహోదా రాకపోతే తనకు ఉద్యోగం రాదన్న ఆలోచనలు వీడకపోవడంతో గురువారం ఉదయం తెల్లవారుజామున 5.30గంటల ప్రాంతంలో నిద్రనుంచి లేచాడు. తన అక్క బుజ్జమ్మతో మాట్లాడాడు. అనంతరం ఇంట్లోని ఫ్యానుకు టెంకాయతాడుతో ఉరివేసుకున్నాడు.

బుజ్జమ్మ ఉదయం 7.30గంటల ప్రాంతంలో ఇళ్లు శుభ్రం చేసుకుంటూ తమ్ముడుంటున్న గదివద్దకు రాగా లక్ష్మయ్య ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని లక్ష్మయ్య మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మయ్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న భార్య విజయమ్మ, ఆమె కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
 
లక్ష్మయ్య ఆత్మహత్య సమాచారం అందుకున్న ఐదోనగర ఇన్‌స్పెక్టర్ పి.సుబ్బారావు, ఎస్‌ఐ జగత్‌సింగ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్,, నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు లక్ష్మయ్య మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

విషయం తెలుసుకున్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహ్మన్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు సంఘటనస్థలానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రాణత్యాగాలు తగదనీ, కలిసి పోరాడితే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఓదార్చారు.
 
ఆత్మహత్యపైనా రాజకీయం!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోతే ఉద్యోగం రాదన్న నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య మృతిని కూడా సర్కారు పక్కదారి పట్టించే ప్రయత్నంచేస్తోంది. ప్రత్యేకహోదా వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని లక్ష్మయ్య లేఖ రాసి మరీ ఉరివేసుకున్నప్పటికీ... సూసైడ్ లెటర్ మృతుడే రాశాడా? ఇతరులెవరైనా రాశారా? అని పోలీసులు రంధ్రాన్వేషణ మొదలుపెట్టారు. అతను గతంలో పనిచేసిన హౌసింగ్‌బోర్డు కార్యాలయ సిబ్బందిని సంప్రదించారు.

సూసైడ్ లేఖలోని రాతలు, సంతకం, గతంలో లక్ష్మయ్య సంతకంతో సరిపోల్చుకున్నారు. చివరకు లక్ష్మయ్యే సూసైడ్ లేఖ రాశారని నిర్ధారణ కొచ్చారు. అయినా లక్ష్మయ్య ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యను చేసుకున్నాడని అంగీకరించేందుకు సర్కారుకు మనసొప్పలేదు. వెంటనే కలెక్టర్ ఎం.జానకి రంగంలోకి దిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మయ్య భార్య విజయమ్మను పలు ప్రశ్నలు వేశారు.

లక్ష్మయ్య గతంలో ప్రత్యేకహోదాకోసం ఏమైనా పోరాటం చేశారా? నిజంగా ప్రత్యేకహోదా కోసమే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యచేసుకుని ప్రత్యేకహోదా కోసమంటూ సృష్టిస్తే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.  అసలు లక్ష్మయ్య ఎంతవరకు చదువుకున్నాడు? రాయడం వచ్చా? అని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. లక్ష్మయ్య రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, వాస్తవాలు వెలుగులోకి వస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని బెదిరించారు. అయినా విజయమ్మ బెదరలేదు. తన భర్త ఏడోతరగతి వరకూ చదువుకున్నాడని, సూసైడ్ లేఖ లోని రాత ఆయనదేనని స్పష్టంచేశారు.

ప్రత్యేకహోదా రాకపోతే భవిష్యత్తు లేదంటూ బుధవారం రాత్రి కూడా తనతో మాట్లాడాడని తెలిపారు. రాత పోల్చుకునేందుకు కోర్టులో ఉన్న కాగితాలను సైతం పోలీసులు తీసుకున్నారని కలెక్టర్‌కు వివరించారు. అయినప్పటికీ... కలెక్టర్ మాత్రం లక్ష్మయ్య ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసి... కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయంతో సరిపెట్టారు. ఈ విషయంపై ఫోరెన్సిక్ నిపుణులతో విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement