ఆన్లైన్ గర్ల్ఫ్రెండ్ కోసం అంతదూరం వెళ్లి.. | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ గర్ల్ఫ్రెండ్ కోసం అంతదూరం వెళ్లి..

Published Wed, Aug 3 2016 10:37 AM

ఆన్లైన్ గర్ల్ఫ్రెండ్ కోసం అంతదూరం వెళ్లి..

ఆన్లైన్ గర్ల్ఫ్రెండ్ను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అనే ఆతృతతో 4,500 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎయిర్పోర్టుకు ఆమె రాకపోవడంతో కాస్త కంగుతిన్నా.. ప్రేయసిపై నమ్మకంతో ఎదురు చూశాడు. ఒకటీ.. రెండు.. పది రోజులు విమానాశ్రయంలోనే కూర్చున్నాడు. అయినా ఆమె రాలేదు. నిరీక్షించీ.. నిరీక్షించి.. నీరసంతో పడిపోయిన ఆ ప్రేమికుణ్ని చివరికి ఎయిర్పోర్టు అధికారులు ఆసుపత్రికి తరలించారు. 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం' లాంటి ఈ నిజజీవిత గాథను చైనాకు చెందిన  సీసీటవీ న్యూస్ పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

41 ఏళ్ల అలెగ్జాండర్ పీటర్ కిర్క్ నెదర్లాండ్ వాసి. 29 ఏళ్ల జాంగ్ చైనీస్ మహిళ. సోషల్ మీడియా ద్వారా కొద్దికాలం క్రితం ఒకరినొకరు పరిచయం చేసుకన్నారు. అభిప్రాయాలు కుదిరాయి.. మనసులు కలిశాయి.. ఆన్లైన్లోనే ప్రేమించుకున్నారు. గత నెలలలో పీటర్.. జాంగ్ కు ఓ మెసేజ్ పంపాడు.. 'ఇక ఎడబాటును భరించలేను.. నీ దగ్గరికి వచ్చేస్తున్నాన్నా.. ఇదిగో ఫ్లైట్ టికెట్..' అని విమానం టికెట్లను ఫొటోతీసి పంపాడు. 4,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. జాంగ్ సొంత ఊరైన చంగ్ షాకు చేరుకున్నాడు. (మధ్యచైనాలోని హునన్ ఫ్రావిన్స్ లో ఉందా ఊరు)

ప్రియురాలు ఎయిర్ పోర్టుకు రాకపోవడంతో 'తను బిజీగా ఉందేమోలే' అని తనకుతాను సర్దిచెప్పుకున్నాడు. ప్రేయసి వచ్చేదాకా ఎయిర్ పోర్టులోనే ఉంటానని అధికారులకు విన్నవించుకున్నాడు. విషయం కాస్తా మీడియాకు తెలిసింది. ఎయిర్ పోర్టులో వెయిటింగ్ చేస్తున్న పీటర్ ఫొటోలను పలు చైనీస్ పత్రికలు ముద్రించాయి. అప్పుడుగానీ జాంగ్ కు విషయం తెలిసిరాలేదు. 'ఫ్లైట్ టికెట్లు ఫొటో తీసి పంపాడు కానీ నిజంగానే అతను చైనా వస్తాడని ఊహించలేదు. ఎయిర్ పోర్టులో పీటర్ నా కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసి షాక్ తిన్నాను. అయితే అతణ్ని నేను కలవాలనుకోవడంలేదు. ఆన్ లైన్ లో మొదలైన మా ప్రేమ మొదట్లో బాగానే ఉంది. రానురానూ పీటర్ నా పట్ల దురుసుగా వ్యవహరించేవాడు. దీంతో అతణ్ని వద్దనుకున్నా' అని ప్రియురాలు జాంగ్ అన్నట్లు సీసీటీవీ న్యూస్ పేర్కొంది.

ప్లాస్టిక్ సర్జరీ కోసం వేరే ఊరికి వెళ్లిన ఆమె ఇప్పట్లో తిరిగిరాదట. ఇటు ఎయిర్ పోర్టులో ఆమెకోసం చూసి, చూసీ నీరసించి పడిపోయిన పీటర్ ను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వచ్చినప్పుడు పిలకతో స్టైలిష్ గా కనిపించిన పీటర్ ఆసుపత్రిలో చేరేనాటికి జుట్టు చెదిరిపోయిన అదోలా తయారయ్యాడు. అతణ్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు జరిగాయి. 'ఇప్పటికి నిరాశతో వెళుతున్నా. కానీ నా గర్ల్ ఫ్రెండ్ ను ఎప్పటికైనా కలుస్తాననే ఆశతో ఉన్నా' అని పీటర్ అంటున్నాడు. ప్రేమ గురించి ప్రచారంలో ఉన్న సామెతలన్నీ పీటర్ లవ్ స్టోరీ విషయంలో నిజమయ్యాయా!


పీటర్ మొబైల్ లో ప్రియురాలు జాంగ్, ఆమెకు పంపిన ఫ్లైట్ టికెట్ల ఫొటోలు

Advertisement
Advertisement