ఎన్నికల వేళ.. భారీ ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. భారీ ఎదురుదెబ్బ!

Published Mon, Jan 9 2017 8:07 PM

Massive setback to Mayawati from brother assets

త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో బహుజన సమాజ్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనందకుమార్‌కు చెందిన రూ. 1300 కోట్ల ఆస్తులపై ఆదాయపన్ను శాఖ కన్ను పడింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా చెబుతోంది. ఏడేళ్ల కాలంలో ఆనందకుమార్ సంపద రూ. 7.1 కోట్ల నుంచి రూ. 1300 కోట్లకు పెరిగినట్లు చెబుతున్నారు. అంటే ఏకంగా 18000 శాతం పెరుగుదల అన్నమాట. ఆయన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఒక్కసారిగా ఆయన సంపద వేల రెట్లు పెరిగిపోయింది. 
 
ఫ్యాక్టర్ టెక్నాలజీస్, హోటల్ లైబ్రరీ, సాచి ప్రాపర్టీస్, దియా రియల్టర్స్, ఇషా ప్రాపర్టీస్ అనే ఐదు కంపెనీలను ఐటీ శాఖ ప్రముఖంగా పేర్కొంది. ఈ ఐదు కంపెనీల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. సరిగ్గా 2007 నుంచి 2012 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఆనందకుమార్ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చిన తీరు మీద కూడా ఆదాయపన్ను శాఖ గట్టిగానే నిఘా వేసింది. షెల్ కంపెనీలు, స్వీట్‌హార్ట్ ఒప్పందాల ద్వారానే ఆయనకు పెట్టుబడులు వెల్లువెత్తాయని అధికారులు అంటున్నారు. బహుశా ఇదంతా కూడా రాజకీయ మనీ లాండరింగ్‌కు సంబంధించిన మొత్తం అయి ఉంటుందన్న కోణంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతోంది.
కంపెనీ 2007 2014
ఫ్యాక్టర్ టెక్నాలజీస్ 0.56 కోట్లు 55.8 కోట్లు
హోటల్ లైబ్రరీ 0.93 కోట్లు 214.4 కోట్లు
సాచి ప్రాపర్టీస్ 2.92 కోట్లు 104.34 కోట్లు
దియా రియల్టర్స్ 0.21 కోట్లు 95.25 కోట్లు
ఇషా ప్రాపర్టీస్ 2.75 కోట్లు 66.68 కోట్లు

 

Advertisement
Advertisement