పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ! | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!

Published Thu, Sep 22 2016 3:28 PM

పాకిస్థాన్‌కే కొమ్ముకాసిన చైనా.. కానీ!

ఊహించినట్టుగానే ’డ్రాగన్‌’ చైనా దాయాది పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, వ్యూహాత్మకంగా కశ్మీర్‌ అంశం, ఉడీ ఉగ్రవాద దాడి అంశాలపై మౌనం వహించినట్టు చైనా మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భేటీ అయ్యారు.

అన్ని కాలాల్లోనూ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా-పాక్‌ పరస్పరం గట్టి మద్దతు ఇచ్చుకుంటున్నాయని, వాటి స్నేహం చెక్కుచెదరనిదని షరీఫ్‌తో భేటీ అనంతరం లీ పేర్కొన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా జిన్హుహా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. పాకిస్థాన్‌కు అన్నివిధాలా ఆచరణాత్మక సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నదని లీ అన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్‌ కారిడర్‌ (సీపీఈసీ)పై పరస్పర సహకారం ద్వారా మంచి పురోగతి సాధించినట్టు లీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా పాక్‌తో అత్యున్నత సంబంధాలు కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు లీ అన్నారని జిన్హుహా పేర్కొంది.

అయితే పాకిస్థాన్‌ మీడియా మాత్రం ఈ భేటీపై తనకు అనుకూలంగా కథనాలు రాసుకుంది. కశ్మీర్‌పై పాక్‌ వైఖరికి చైనా మద్దతును కొనసాగిస్తామని లీ షరీఫ్‌కు చెప్పినట్టు డాన్‌ దినపత్రిక చెప్పుకొచ్చింది. ’మేం పాకిస్థాన్‌కు మద్దతునిస్తాం.  ప్రతి వేదికపై ఆ దేశం కోసం మాట్లాడుతాం’ అని లీ షరీఫ్‌కు హామీ ఇచ్చినట్టు ’డాన్‌’ రాసుకొచ్చింది. కశ్మీర్‌ పై పాక్‌ వైఖరికి చైనా గొప్ప ప్రాధాన్యాన్ని ఇస్తున్నదని, పాకిస్థాన్‌ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని చైనా పేర్కొన్నదని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

Advertisement
Advertisement