వారు నిరూపిస్తే ఉరికైనా సిద్ధం- మంత్రి | Sakshi
Sakshi News home page

వారు నిరూపిస్తే ఉరికైనా సిద్ధం- మంత్రి

Published Sun, May 28 2017 9:47 AM

వారు నిరూపిస్తే ఉరికైనా సిద్ధం- మంత్రి - Sakshi

► రాజీనామాకు ఒత్తిడి
►మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ
►పాలల్లో ఫార్మా డిలైట్‌ గుర్తింపు
►సిట్టింగ్‌ జడ్జి విచారణకు స్టాలిన్‌ డిమాండ్‌


చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, ఉరి కంభంలో వేలాడేందుకైనా తాను సిద్ధం అని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. పాలల్లో పలు మిశ్రమాలతో కూడిన ఫార్మా డిలైట్‌ అన్న రసాయనాన్ని గుర్తించామన్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రైవేటు సంస్థలు ఖండిస్తున్నాయి. ప్రైవేటు పాల వ్యాపారం దెబ్బ తినే ప్రమాదంతో ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ లాంటి వాళ్లు ఒకరిద్దరు మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మరి కొందరు ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించారోనని ప్రశ్నిస్తున్నారు.

 ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్‌ అయితే, తాజా పరిణామాలు, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించారు. గతంలో ప్రభుత్వ రంగం సంస్థ ఆవిన్‌లో సాగిన అవినీతి మాయాజాలాన్ని గుర్తు చేస్తూ, ఆ విచారణ ఏమైనట్టో ప్రశ్నించారు. ప్రైవేటు పాల విషయంగా సాగుతున్న మిక్సింగ్‌ గురించి మంత్రి  ఆలస్యంగానైనా నోరు మెదిపి  ఉండడం అనుమానాలకు దారి తీస్తున్నాయని శనివారం తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శివకాశిలో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌ వ్యాఖ్యలను మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆహ్వానించడం గమనార్హం.

ఉరికి సిద్ధం :

రసాయనాల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేయడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. ప్రైవేటు పాలలో రసాయనాలు ఉన్న విషయం నిర్ధారణ అయిందన్నారు. గిండి, మాధవరంలలోని ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో ఫార్మా డిలైట్‌ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం శాంపిల్స్‌ పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే, ప్రైవేటు పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విజయకాంత్‌ లాంటి వాళ్లు ప్రైవేటు పాల సంస్థలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తుండడం, మరి కొందరు అయితే, తనను పదవికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడికి దిగడం శోచనీయమని విమర్శించారు.

తాను ఎన్నడూ ప్రైవేటు పాల సంస్థల వద్ద చేతులు చాచ లేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, పదవికి తానే రాజీనామా చేస్తానని, ఉరి కంబంలో వేలాడేందుకు కూడా సిద్ధం అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ శాఖ మంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రసాయనాల వ్యవహారం ఫిర్యాదు రూపంలో చేరిందని, రహస్యంగా విచారించి, నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం బయట పెట్టానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజీనామాకు ఒత్తిడి తెచ్చినా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ప్రైవేటు పాల రసాయనాల భరతం పట్టే విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement