టీ ప్రాజెక్టుల నిలిపివేతకు టీడీపీ కుట్ర | Sakshi
Sakshi News home page

టీ ప్రాజెక్టుల నిలిపివేతకు టీడీపీ కుట్ర

Published Fri, Feb 19 2016 3:10 AM

టీ ప్రాజెక్టుల నిలిపివేతకు టీడీపీ కుట్ర - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్‌ను ఎంతగా విమర్శిస్తే, అంతగా ఏపీ ప్రజలకు దగ్గర కావచ్చని తెలుగుదేశం అల్ప బుద్ధిని ప్రదర్శిస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఏపీలో రాజకీయ ఆధిపత్యం కోసం తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాజెక్టులపై పడి ఏడ్వటం వారి రాజకీయ దివాళాకోరు తనానికి నిదర్శమన్నారు. గురువారం మంత్రి హరీశ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటోందని అన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, డిండి ప్రాజెక్టును నిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆ ప్రకటనలో తెలిపారు. పాలమూరు, డిండి పథకాలను అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కువమంది వలస కూలీలు ఉన్న దురదృష్టమైన జిల్లాగా పేరుపడ్డ పాలమూరు ప్రజల బతుకుల్లో మార్పు రావడాన్ని టీడీపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు.  ఫ్లోరైడ్ పీడిత బాధితులున్న నల్లగొండ జిల్లాకు రక్షిత తాగు, సాగునీరు ఇవ్వడం వారికి కంటగింపుగా మారిందని దుయ్యబట్టారు.
 
పాత ప్రాజెక్టులే.. కడుపు మంటెందుకు..?

కృష్ణానది నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉందని, మిగులు జలాల్లో కనీసం 150 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయి. మొత్తంగా 499 టీఎంసీల వాటా దక్కుతుంది. ఇప్పటి దాకా కృష్ణానదిలో 150 టీఎంసీలు కూడా వాడుకోలేదు. పాలమూరు ద్వారా 70 టీఎంసీలు, డిండి ద్వారా 30 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యి, అనుకున్న స్థాయిలో నీటిని వాడుకున్నా, కృష్ణా నదిలో ఇంకా తెలంగాణ వాటా నీళ్లు మిగిలే ఉంటాయని మంత్రి హరీశ్ రావు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే బీమా ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, బీమా ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే పాలమూరు, డిండి ప్రాజెక్టులను చేపడుతున్నామని, కేటాయింపు ఉన్న నీళ్లనే వాడుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే డిండి ప్రాజెక్టు నిర్మిస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సర్వే చేయాలని కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు.  

2014 సార్వత్రిక ఎన్నికల  ప్రచారం లో పాల్గొన్న మోదీ మహబూబ్‌నగర్ సభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయలేకపోయిన కాంగ్రెస్‌ను విమర్శించారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ పార్టీలకు తోక పార్టీగా మారిందని, పాలమూరును అడ్డుకోవడానికి టీడీపీ చేసే కుట్రలకు ఉత్తమ్ వంతపాడటం సిగ్గుచేటన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement