లాలు వారసులొచ్చారు! | Sakshi
Sakshi News home page

లాలు వారసులొచ్చారు!

Published Sun, Nov 8 2015 7:55 PM

లాలు వారసులొచ్చారు! - Sakshi

పట్నా: బిహార్ ఎన్నికల్లో లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పడిలేచిన కెరటంలా అనూహ్యంగా పుంజుకుంది. 80 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలువడంతో నితీశ్ ప్రభుత్వంలో లాలూ కింగ్‌ మేకర్ పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న లాలు తనయులు తేజస్వి (26), తేజ్ ప్రతాప్ (27)పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తేజస్వి రాఘోపూర్, తేజ్ ప్రతాప్ మహువా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో చిన్నవాడైన తేజస్వినే లాలు రాజకీయ వారసుడిగా భావిస్తున్నారు.

నితీశ్ ప్రభుత్వంలో ఈ ఇద్దరు యువనేతలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. జేడీయూ కన్నా అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ సీఎం పీఠాన్ని నితీశ్‌కు విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆర్జేడీ అత్యధిక క్యాబినెట్‌ బెర్తులను కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో లాలు తనయులు ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

15 ఏళ్ల తర్వాత ఆర్జేడీ మళ్లీ బిహార్ ఎన్నికల్లో సత్తా చాటింది. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థితికి ఎదిగింది. అయితే, దాణా కుంభకోణంలో శిక్షపడటంతో లాలూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన నేరుగా పదవులు చేపట్టే అవకాశం లేకపోవడంతో లాలు తనయులే ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పుతారని భావిస్తున్నారు.

మా సోదరులకు ఎందుకు ఇవ్వకూడదు?
నితీశ్ ప్రభుత్వంలో లాలు తనయులకు మంత్రి పదవులు లభిస్తాయా? అన్న దానిపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. తన తనయులు ఇద్దరికి మంత్రి పదవులు విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై పార్టీ అధినాయకత్వం తీసుకుంటుందని లాలూ సతీమణి రబ్రీదేవి పేర్కొన్నారు. మరోవైపు లాలు కూతురు మాత్రం సోదరులకు మద్దతు పలికారు. ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కరూ మంత్రి పదవి కోరుకుంటారని, అయినా తన ఇద్దరు సోదరులకు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. అయితే, ఈ విషయమై ఏ నిర్ణయమైనా పార్టీ సీనియర్ నేతలే తీసుకుంటారని ఆమె చెప్పారు.


 

Advertisement
Advertisement