నెహ్రూకు పోటీగా.. మోదీ? | Sakshi
Sakshi News home page

నెహ్రూకు పోటీగా.. మోదీ?

Published Mon, Mar 13 2017 1:39 AM

నెహ్రూకు పోటీగా.. మోదీ? - Sakshi

జనాదరణలో జవహర్‌లాల్‌తో పోటీపడుతున్న నరేంద్రుడు
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలతో ఇందిరను వెనక్కి నెట్టిన ప్రధాని


న్యూఢిల్లీ: జనాదరణ విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంత ఉన్నతుడో ఒక సందర్భంలో ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ వివరించారు. అప్పట్లో ముంబైలో కాంగ్రెస్‌ నిర్వహించిన ఒక సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఆ సమయంలో పటేల్‌ అమెరికా జర్నలిస్ట్‌ విన్సెంట్‌ షీన్‌తో మాట్లాడుతూ.. ‘‘వారు వచ్చింది నాకోసం కాదు. జవహర్‌ కోసం’’ అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. భారీ మెజార్టీతో ఉత్తరప్రదేశ్‌ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం నేతలలో నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ఉక్కుమహిళగా పేరొందిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు.

అమిత్‌ షా మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుత ప్రధాని తొలి ప్రధానినే అధిగమించేశారని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. భారత చరిత్రను అధ్యయనం చేస్తున్నవారికి, విశ్లేషకులకు అమిత్‌ షా వ్యాఖ్యలు ఒక అతిశయోక్తిగానే కనిపిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ తర్వాత స్థానం నెహ్రూదే. తిరుగులేని ఆయన శక్తిని తరచూ ‘‘నెహ్రూ స్వామ్యం’’గా అభివర్ణించేవారు. స్వాతంత్య్రం తదనంతర దేశ నిర్మాణంలో ఆయన పాత్ర గణనీయమైనది. అయితే అమిత్‌ షా వ్యాఖ్యలు ఏమంత తీసిపారేయతగ్గవి కూడా కాదు. ఇప్పటి మోదీ జనాదరణ అప్పటి నెహ్రూ జనాదరణతో పోటీ పడుతోంది.

2014లో చిన్న విజయం..
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల కంటే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ షేర్‌ మాత్రం చాలా తక్కువగా ఉంది. 1977లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్‌ షేర్‌ను కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్‌ దిగ్గజ నేతలతో పోటీలో మోదీ వెనకబడ్డారని చెప్పలేం. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన అధికారంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్‌ షేర్‌ (దాదాపు 40 శాతం) చూస్తే.. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్‌ షేర్‌ను అధిగమించేసింది.

అంతేగాక 1962లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్‌ సాధించిన ఓట్‌ షేర్‌ (36 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో సాధించిన ఈ విజయం సాధారణమైనదికాదు. మోదీ గుజరాత్‌ను వదిలి ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేయడం మొదలు దీని వెనకాల ఎంతో కృషి ఉందని చెప్పవచ్చు. అలాగే ఒక్కో రాష్ట్రంలోనూ బీజేపీ పాగా వేస్తూ వస్తోంది. 1967లో కాంగ్రెస్‌ 10 రాష్ట్రాలను పాలిస్తే.. 2017లో బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోంది. దీనిని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

మోదీ స్వామ్యం..
అప్పట్లో నెహ్రూకు ఉన్న జనాదరణతో పార్టీలో ఉన్న రైటిస్టులు కూడా కిమ్మనకుండా ఉండేవారు. దీంతో నెహ్రూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. పథకాలు, చట్టాలు రూపకల్పన చేశారు. పురాతన హిందు సంప్రదాయాలు స్థానంలో ప్రగతిశీల చట్టాలను తీసుకొచ్చారు. లౌకిక విధానాన్ని అవలంభించి దేశ విభజన తర్వాత భారత్‌లోని ముస్లింలకు భద్రత కల్పించే చర్యలు తీసుకున్నారు. అయితే నరేంద్ర మోదీది రైటిస్ట్‌ భావజాలం. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేయడంతో ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది.

నెహ్రూ స్థాయిలో ఆయన అధికారాలు ఉంటే దేశాన్ని తన భావజాలంవైపు తీసుకెళ్లవచ్చు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పోటీకి దింపలేదు. ఈ విజయం పూర్తిగా హిందు ఓట్‌ బ్యాంకుపై ఆధారం. తానో హిందు శక్తిగానే కనిపించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement