ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు | Sakshi
Sakshi News home page

ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు

Published Mon, Sep 21 2015 3:07 AM

ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు - Sakshi

* మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
* చేనేతను ప్రోత్సహించండి.. కనీసం ఒక ఖాదీ వస్త్రం కొనండి
* అదే గాంధీజీకి నిజమైన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు తనను కలవనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వివిధ దేశాల్లో నేతాజీ కుటుంబానికి చెందిన దాదాపు 50 మంది తనను కలుస్తారని పేర్కొన్నారు.

ప్రతినెలా నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో మాట్లాడారు. ‘మే నెలలో నేను కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులను కలిశాను. నేతాజీ కుటుంబీకులంతా ఓసారి ప్రధాని నివాసాన్ని సందర్శించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. పలు దేశాల్లో ఉంటున్న సుభాష్ బాబు కుటుంబీకులు 50 మందిని వచ్చేనెలలో కలుసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. వారంతా కలసి ప్రధాని నివాసానికి రావడం బహుశా ఇదే మొదటిసారి.

ఇంతటి గొప్ప అవకాశం ఇంతకుముందు ఏ ప్రధాని కూడా రాలేదు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లు బయటపెట్టడం తెలిసిందే. అదే తరహాలో కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లు బహిర్గత పరచాలని బెంగాల్ సీఎంతోపాటు పలువురు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై మోదీ మాట్లాడలేదు. గత మన్‌కీ బాత్ కార్యక్రమాల్లో మాట్లాడిన వివిధ అంశాలనే మరోసారి గుర్తుచేశారు. అరగంట మాట్లాడిన ఆయన.. ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవడం, ఖాదీకి ప్రోత్సాహం, స్వచ్ఛభారత్ వంటి అంశాలను ప్రస్తావించారు.

1965నాటి భారత్-పాక్ యుద్ధంలో మరణించిన జవాన్లకు నివాళి ప్రకటించారు. బిహార్ ఎన్నికలను నేరుగా ప్రస్తావించకుండానే.. పోలింగ్ శాతం పెరగాలని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. గతంలో ఎన్నికల సంఘం ఒక నియంత్రణ సంస్థగా ఉండేదని, కానీ కొన్నేళ్లుగా ఓటర్లలో అవగాహన పెంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

ప్రజలను చేరడానికి రేడియో ఒక ప్రధాన సాధనమని, నేతాజీ కూడా జర్మనీలో రేడియో స్టేషన్ ద్వారా పలు భాషల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారని గుర్తుచేశారు. ‘గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఖాదీని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. అదే ఆయనకు నిజమైన నివాళి.  ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఖాదీ వస్త్రం, ఒక చేనేత ఉత్పత్తి కొనాలి. అక్టోబర్ 2 నుంచి నెల రోజులు ఖాదీ, చేనేత దుస్తులపై కల్పించే రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. చేనేత దుస్తులు కొనడం ద్వారా ప్రజలిచ్చే డబ్బు పేద చేనేతకారులకు చేరుతుందన్నారు. కిందటేడాది సరిగ్గా గాంధీ జయంతి రోజునే మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
 
‘ఇతర దేశాలూ ఫైళ్లను బయటపెట్టాలి’
కోల్‌కతా:  నేతాజీ అదృశ్యానికి సంబంధించి వివిధ దేశాల దగ్గరున్న ఫైళ్లను బహిర్గతం చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈమేరకు ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలని మోదీని కోరనున్నట్లు నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్న ఫైళ్ల ద్వారా నేతాజీ అదృశ్యానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియకపోవచ్చని, ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో 4 కీలక ఫైళ్లను ధ్వంసం చేశారని ముఖర్జీ కమిషన్ చెప్పిందని అన్నారు.

అందువల్ల రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేసియా దేశాలకు ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరుతూ లేఖ రాయాలని  మోదీని కోరనున్నామని తెలిపారు. కాగా, కేంద్రం వద్ద ఉన్న నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Advertisement
Advertisement