మోదీపై లండన్‌లో ‘అవాజ్’ | Sakshi
Sakshi News home page

మోదీపై లండన్‌లో ‘అవాజ్’

Published Thu, Nov 12 2015 1:34 PM

మోదీపై లండన్‌లో ‘అవాజ్’ - Sakshi

లండన్: భారత్‌లో ‘అసహనం’కు వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాటం లండన్‌దాకా పాకింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల లండన్ పర్యటనను వ్యతిరేకిస్తూ బ్రిటన్ సామాజిక కార్యకర్తల నెట్‌వర్క్ ‘అవాజ్’ గురువారం లండన్ వీధుల్లో ప్రదర్శన జరిపింది. విద్వేషపూరిత రాజకీయాలకు తాము వ్యతిరేకమని, హిందూ, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, హేతువాదులు సభ్యులుగావున్న ‘అవాజ్’ సంఘం నినదించింది.

‘మేము మోదీని స్వాగతించడం లేదు’ అనే నినాదంతో ఆదివారం నాడు లండన్ పార్లమెంట్ భవనంపై అవాజ్ ప్రొజెక్ట్ చేసిన పోస్టర్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఆ పోస్టర్‌పై చేతిలో ఖడ్గం ధరించిన మోదీ చిత్రంతోపాటు స్వస్తిక్ గుర్తును తలపించేలా ‘ఓం’ గుర్తును చిత్రీకరించడం ప్రధానంగా వివాదాస్పదమైంది. దీనిపై బ్రిటన్ ప్రజా ప్రతినిధుల సభలో పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టర్ ప్రదర్శనకు బాధ్యులైన వారిని విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై డిప్యూటీ స్పీకర్ లిండ్సే హోయల్ స్పందిస్తూ ‘రిమెంబ్రెన్స్ డే ( రెండు ప్రపంచ యుద్ధాల్లో మరణించిన సైనికులకు నివాళి అర్పించడం కోసం కామన్వెల్త్ దేశాలు జరుపుకునే సంస్మరణ దినం) సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంట్ గోడలపై ఏమైనా ప్రొజెక్టు చేసుకోవచ్చని, అయితే ఓం...ను స్వస్తిక్ అర్థం వచ్చేలా చిత్రీకరించడం, ఓ దేశానినేత ఫొటోను అలా ప్రొజెక్ట్ చేయడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని అన్నారు. తీసుకునే చర్యల గురించి ఆయన ప్రస్తావించలేదు.

అయితే తాము ఎందుకు అలా చిత్రీకరించాల్సి వచ్చిందో ‘అవాజ్’ సంస్థ వివరణ ఇచ్చింది. ‘మైనారీలు, హేతువాదులు, దళితులు, రాజకీయ ప్రత్యర్థులపై భారత్‌లో అసహనంతో దాడులు చేస్తున్నారు. రిమెంబ్రెన్స్ డేను పుస్కరించుకొని నాజీయిజం ఆనవాళ్లంటిని ప్రశ్నించదల్చుకున్నాం.  నాజీయిజంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పలు దేశాల సైనికులతోపాటు భారతీయులు చనిపోయారు. హిట్లర్‌ను, ముస్సోలిన్‌ను ఆరాధించే ఆరెస్సెస్ వ్యవస్థాపకులు నాజీయిజంను సమర్ధించడం అందరికి తెల్సిందే. ప్రపంచంలో గొప్ప మతాల్లో ఒకటైన హిందూ మతాన్ని ఫాసిస్ట్ మతంగా మార్చేందుకు నేడు ఆరెస్సెస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానికి అధికారంలో ఉన్న మోదీ ఆమోదం కూడా ఉంది. అందుకనే ఆ విధంగా మేము పోస్టర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో ఎంతోమంది సాంకేతిక నిపుణలు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మన్ కూడా ఆరెస్సెస్ వాది. ఆయన లండన్‌లో జరిగిన పలు ఆరెస్సెస్ శిబిరాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు’ అని అవాజ్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement