ఏటీఎం క్యాష్‌తో బ్యాంకు ఉద్యోగి పరార్‌ | Sakshi
Sakshi News home page

ఏటీఎం క్యాష్‌తో బ్యాంకు ఉద్యోగి పరార్‌

Published Tue, Nov 15 2016 3:03 PM

ఏటీఎం క్యాష్‌తో బ్యాంకు ఉద్యోగి పరార్‌

మొహాలీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక ప్రజలు కరెన్సీ కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల కొద్దీ క్యూలో ఉంటూ నానాపాట్లు పడుతున్నారు. కాగా పంజాబ్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి ఏటీఎంలో నింపేందుకని తీసుకెళ్లిన నగదుతో ఉడాయించాడు.

తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ భాటియా అనే వ్యక్తి పంజాబ్‌ సింధ్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మొహాలీ జిల్లాలోని బంకర్‌పూర్‌ గ్రామంలోని ఏటీఎంలో డిపాజిట్‌ చేసేందుకు బ్యాంకు అధికారులు ఆయనకు 6.98 లక్షల రూపాయల నగదును అందజేశారు. భాటియా పర్యవేక్షణలో ఏటీఎంలో డబ్బులు నింపాల్సిందిగా బ్యాంకు ఇంజినీర్లకు, భద్రత సిబ్బందికి సూచించారు. కాగా తాను సొంత వాహనంలో వచ్చి బంకర్‌పూర్‌ ఏటీఎం వద్ద కలుస్తానని భాటియా వారితో చెప్పాడు. భాటియా ఈ మొత్తాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇంజినీర్లు, భద్రత సిబ్బంది ఏటీఎం వద్దకు వెళ్లి భాటియా కోసం నిరీక్షించగా ఆయన అక్కడకు వెళ్లలేదు. భాటియా సెల్‌ ఫోన్‌కు కాల్‌ చేస్తే స్విచాఫ్‌ అయ్యింది. బ్రాంచ్‌ మేనేజర్‌ కూడా భాటియాను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ మరుసటి అనగా గత గురువారం బ్రాంచి మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టామని, త్వరలోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement