ఫోర్బ్స్‌లో మనోళ్ల ఫోర్స్‌! | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌లో మనోళ్ల ఫోర్స్‌!

Published Mon, Apr 17 2017 11:19 PM

ఫోర్బ్స్‌లో మనోళ్ల ఫోర్స్‌!

► 30 అండర్‌ 30 జాబితాలో చోటు సంపాదించుకున్న 53 మంది భారతీయులు

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ ఆసియా సూపర్‌ అఛీవర్స్‌ జాబితాలో మనోళ్లు సత్తాచాటారు. వివిధ రంగాల్లో అతి చిన్న వయసులోనే లక్ష్యాలను సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తులతో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. 30 అండర్‌ 30 ఆసియా పేరుతో తయారుచేసిన ఈ జాబితాలో భారత్‌ నుంచి జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్, ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్, బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ సహా 53 మంది చోటు దక్కించుకున్నారు. చైనా తర్వాత భారత్‌ నుంచే అతి ఎక్కువ మంది ఈ జాబితాలో చోటు సాధించారు.

వివిధ రంగాల్లో సత్తా చాటిన 30ఏళ్లలోపు యువ అఛీవర్స్‌తో ఫోర్బ్స్‌ ఈ జాబితా తయారుచేసింది. వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు ఇలా పది రంగాల్లో 30 మంది చొప్పున 300 మందితో ఈ జాబితా రూపొందించింది. దీనిలో భారత్‌కు చెందిన 53 మంది చోటు సాధించారు. ఇందులో దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, ఆలియాభట్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ పోతుకూచి, కరీంనగర్‌కు చెందిన చిలప్పగరి సుధీంద్ర తదితరులున్నారు. కాగా.. చైనా నుంచి 76మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.

ప్రతిభకు పట్టం..: 23ఏళ్ల దీప ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌ చరిత్రలోనే జిమ్నాస్టిక్స్‌ విభాగంలో పోటీపడిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ విభాగంలో తొలి పతకం సాధించినతొలి భారత మహిళగా సాక్షి మాలిక్‌ గుర్తింపు దక్కించుకుంది. 24ఏళ్ల సాక్షి.. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఇక పారిశ్రామిక రంగంలో శ్రీకాంత్‌ బొల్లా, వినోదరంగం నుంచి బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

సత్తాచాటిన తెలుగు తేజాలు..
హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ఇద్దరు తెలుగు తేజాలు కూడా ఫోర్బ్స్‌లో సత్తాచాటారు. స్టాండర్డ్‌ ఇండియన్‌ లీగల్‌ సైటేషన్‌ (ఎస్‌ఐఎల్‌సీ)ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రోహిత్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. న్యాయవిద్యకు సంబంధించి రోహిత్‌ రాసిన డాక్యుమెంటేషన్, రీసెర్చ్‌ను హార్వర్డ్‌ లా స్కూల్‌ గుర్తించింది. అంతేకాక దానిని దేశవ్యాప్తంగా 300కుపైగా న్యాయ కళాశాలల్లో బోధనాంశంగా స్వీకరించడం విశేషం. రోహిత్‌ 2013లో హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయంలో లా చదివారు.

కరీంనగర్‌ టెకీకి పట్టం..
తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన చిలప్పగరి సుధీంద్రకు కూడా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. belong.co ‍పేరుతో ఓ స్టార్టప్‌ను ఏర్పాటుచేసి, దాదాపు 100 మందికిపైగా యువతకు  ఉపాధి కల్పించడంతోపాటు టెక్‌ రంగంలో వినూత్న ఆలోచనలకు తెరలేపుతున్నందుకుగాను సుధీంద్రను ఈ జాబితాలో చేరుస్తున్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది.

Advertisement
Advertisement