ప్చ్.. ఈ ఏడాది కష్టమే! | Sakshi
Sakshi News home page

ప్చ్.. ఈ ఏడాది కష్టమే!

Published Fri, Jan 17 2014 1:24 AM

ప్చ్.. ఈ ఏడాది కష్టమే!

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ  2014లో అధ్వానంగా ఉంటుందని 48 శాతం భారతీయ కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి. సరుకులు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రానున్న 12 నెలల్లో ఆకాశాన్ని అంటుతాయని దాదాపు 75 శాతం కుటుంబాలవారు భావిస్తున్నారు. ప్రిన్సిపల్ రిటైర్‌మెంట్ అడ్వైజర్స్ (ఇండియా) మొట్టమొదటి దేశ ఆర్థిక సంక్షేమ సూచీ నివేదిక ఈ విషయాలను పేర్కొంది. ఈ ఏడాదిపై భారతీయ కుటుంబాలు ఆందోళనకరమైన దృక్పథంతో ఉన్నట్లు అడ్వైజర్స్ గ్రూప్ కంట్రీ హెడ్ (ఇండియా) రాజన్ ఘట్‌గాల్కర్ అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంధన ధరలు తీవ్ర ఆందోళనకు కారణాలని వివరించారు. మరిన్ని  ముఖ్యాంశాలు...
 

  • 2012 డిసెంబర్‌తో పోల్చితే 2013 డిసెంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఐదు నెలల కనిష్ట స్థాయిలో 6.16%గా నమోదయినప్పటికీ, రానున్న ఏడాది కాలంలో ధరల పెరుగుదల ఖాయమని సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది అభిప్రాయంగా ఉంది.
  • ఆహారోత్పత్తులు, పానీయాలు, రవాణా వంటి అంశాల్లో వ్యయాల పెరుగుదల కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
  • వచ్చే ఏడాదిలో గృహ రుణ వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉందన్నది 78% మంది ఆందోళన.
  • అయితే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని నియంత్రణలోనే ఉంచుకుంటున్నామని, ఆర్థిక లక్ష్యాల సాధనలో పురోగతిని సాధిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారు పేర్కొనడం విశేషం.
  • ఇళ్లు లేదా ఆస్తి కొనుగోలు.. అలాగే విద్య, పెళ్లిళ్ల వంటి అంశాలకు సంబంధించి పిల్లలపై జరిపే వ్యయాలు 2014లో భారంగా మారవచ్చన్నది సర్వేలో మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం.  
  • 11 నగరాల్లోని 1,664 మంది అభిప్రాయాలను తమ పరిశోధనకు సంస్థలు ప్రాతిపదికగా తీసుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారి వయసు 25-60 ఏళ్ల శ్రేణిలో ఉంది. వార్షికంగా రూ.5 లక్షలకు పైగా కుటుంబ ఆదాయం ఉన్నవారి అభిప్రాయాలను సంస్థలు తీసుకున్నాయి.
  • 2013 చివరి క్వార్టర్‌లో నీల్సన్ కంపెనీ భాగస్వామ్యంతో  ప్రిన్సిపల్ రిటైర్‌మెంట్ అడ్వైజర్స్ భారత్‌లో ఈ అధ్యయనం నిర్వహించింది. అమెరికాలో 12 సంవత్సరాలుగా సంస్థ ఈ తరహా అధ్యయనాన్ని నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement