మా ఓటమికి ఆ ఇద్దరే కారణం: స్టీవ్‌ స్మిత్‌ | Sakshi
Sakshi News home page

మా ఓటమికి ఆ ఇద్దరే కారణం: స్టీవ్‌ స్మిత్‌

Published Mon, Sep 18 2017 10:30 AM

మా ఓటమికి ఆ ఇద్దరే కారణం: స్టీవ్‌ స్మిత్‌

సాక్షి, చెన్నై: హార్థిక్‌ పాండ్యా, ఎంఎస్ ధోనీ భాగస్వామ్యం మ్యాచ్‌ను తమకు కాకుండా చేసిందని, ఆ ఇద్దరి పార్ట్‌నర్‌షిప్‌ వల్లే తాము ఓడామని ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మీత్‌ అభిప్రాయపడ్డాడు. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో 26 పరుగులతో ఓటమిపాలైన అనంతరం స్టీమ్‌ స్మీత్‌ విలేకరులతో మాట్లాడాడు. 'కొత్త బాల్‌తో మేం బాగా బౌలింగ్ చేశాం. కానీ భారత ఆటగాళ్లను నియంత్రించలేకపోయాం. ముఖ్యంగా ఎంఎస్‌ ధోనీ, హార్థిక్‌ బాగా ఆడారు. మ్యాచ్‌లో డిఫరెన్స్‌ చూపింది వారే. మంచి ఆరంభం దొరికినా దానిని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం' అని స్మీత్‌ అన్నాడు.

వర్షం అడ్డంకిగా మారడం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపిందని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్‌ మిడిలార్డర్‌లో మేం త్వరగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. అయినా వాతావరణాన్ని మేం నియంత్రించలేం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు' అని అన్నాడు. ఈరోజు మేం బాగా ఆడలేదు. భారత్‌ మా కన్నా మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు' అని స్మీత్‌ పేర్కొన్నాడు.  

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి విజయంతో భారత్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్‌ 26 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం) ఆసీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎమ్మెస్‌ ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఎట్టకేలకు వాన ఆగిన తర్వాత ఆసీస్‌ విజయ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. ఆ జట్టు చివరకు 21 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరుగుతుంది.

 

 

Advertisement
Advertisement