పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల | Sakshi
Sakshi News home page

పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల

Published Sat, Apr 11 2015 3:26 AM

పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల

కోర్టు ఆదేశాలను పాటించిన జైలు అధికారులు
తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన భారత్

 
 న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని నిర్బంధాన్ని లాహోర్ హైకోర్టు తప్పుబట్టడంతో ఆరేళ్ల జైలు జీవితం నుంచి లఖ్వీకి విముక్తి కలిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు అందగానే రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు శుక్రవారం మధ్యాహ్నం లఖ్వీని విడిచిపెట్టారు. ఒంటి గంట ప్రాంతంలో నాలుగైదు కార్లు జైలు వద్దకు వచ్చాయి. లఖ్వీ తరఫు లాయర్ తెచ్చిన పత్రాలను పరిశీలించిన అధికారులు అతని విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన లఖ్వీ నేరుగా తన కారులో కూర్చుని ఇస్లామాబాద్‌లోని నివాసానికి వెళ్లిపోయాడు.
 
 లఖ్వీ విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అతని లాయర్ కోర్టు ఉత్తర్వులను తెచ్చివ్వడంతో విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అయితే లఖ్వీని నిర్బంధంలోనే ఉంచడానికి ప్రభుత్వం సమాలోచనలు జరిపినప్పటికీ అందుకు ఎలాంటి న్యాయపరమైన మార్గాలూ లేకపోవడంతో మిన్నకుండిపోయింది. శాంతిభద్రతల నిర్వహణ కింద ముందుజాగ్రత్తగా లఖ్వీని నిర్బంధంలోనే ఉంచాలని  ఇప్పటికే రెండుసార్లు ఇచ్చిన ఆదేశాలను ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టులు తోసిపుచ్చాయని, ఇక మళ్లీ అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందుకే ఈసారి కోర్టు ఆదేశాలను పాటించాల్సి వచ్చినట్లు వివరించారు.
 
 ప్రపంచానికి మంచిది కాదు: ఫ్రాన్స్
 ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు హోలాండ్‌తో జరిపిన చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. లఖ్వీ విడుదల తీవ్ర దిగ్భ్రాంతికరమని హోలాండ్ పేర్కొన్నారు. లఖ్వీ విడుదల భారత్‌కు, ప్రపంచానికి మంచిది కాదని మోదీని కలుసుకున్న ఫ్రాన్స్ ఎంపీలలో ఒకరు అన్నారు. ఉగ్రవాద నిరోధంపై ఫ్రాన్స్, భారత్‌లది ఒకే వైఖరి అని మోదీ అన్నారు.  
 
 పాక్ హామీలకు వ్యతిరేకం: భారత్
 లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్‌గా ఉన్న లఖ్వీ విడుదలపై భారత్ ముందునుంచీ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. లాహోర్ హైకోర్టు నిర్ణయంపైనా అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై పాక్ తమకు ఇచ్చిన హామీలకు ఇది వ్యతిరేకమని పేర్కొంది. ఉగ్రవాదుల విషయంలో పాక్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. లఖ్వీ విడుదల ముంబై ఉగ్ర దాడుల బాధితులకు అవమానకరమని, ఈ విషయంలో పాక్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలంది. లఖ్వీ విడుదల దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పాక్‌తో చర్చలను భారత్ కోరుకుంటున్నప్పటికీ తాజా పరిణామం దురదృష్టకరమని, అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు.  
 
 ఇలాంటి నిర్ణయాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. లఖ్వీకి సంబంధించిన కీలక వివరాలను కోర్టు ముందుంచడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా, సిమీ, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఐదుగురు విచారణ ఖైదీలను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై మీడియా ప్రశ్నించగా.. అది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని దాటవేశారు. మరోవైపు లఖ్వీ విడుదల నేపథ్యంలో భారత్‌కు ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనడానికి దేశం సిద్ధంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.  లఖ్వీ విడుదలపై పాక్‌లోని తమ హైకమిషనర్  ఆ దేశ విదేశాంగ కార్యదర్శికి నిరసన తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా,   ముంబై దాడుల విచారణలో సహకరించేందుకు భారత్ మితిమీరిన  జాప్యం చేయడంతో ప్రాసిక్యూషన్ వాదన బలహీనమై, లఖ్వీ విడుదలకు దారితీసిందని పాక్ విదేశాంగ  ప్రతినిధి తాస్నిమ్ ఆరోపించారు.

Advertisement
Advertisement