పాక్‌ గడ్డపైనే ‘ముంబై’ కుట్ర | Sakshi
Sakshi News home page

పాక్‌ గడ్డపైనే ‘ముంబై’ కుట్ర

Published Tue, Mar 7 2017 1:28 AM

పాక్‌ గడ్డపైనే ‘ముంబై’ కుట్ర

పాక్‌ జాతీయ భద్రతా మాజీ సలహాదారు దురానీ
న్యూఢిల్లీ:ముంబైలో 26/11 దాడులు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులే చేశారని స్వయంగా ఆ దేశ జాతీయ భద్రతా మాజీ సలహాదారు మహమూద్‌ అలీ దురానీ వెల్లడించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది సీమాంతర ఉగ్రవాదానికి ‘మచ్చుతునక’ అని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్  స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆధ్వర్యంలో ‘ఉగ్రవాదంపై పోరు’ అనే అంశంపై జరిగిన సదస్సులో దురానీ మాట్లాడారు. పేదరికం, అవిద్య, అస్తవ్యస్త చట్టాలు, బలహీనమైన పోలీసింగ్‌ పాక్‌లో ఉగ్రవాదం పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు.

అయితే పాక్‌ ప్రభుత్వా నికి, ఐఎస్‌ఐకి ముంబై ఉగ్రదాడులకు ప్రత్యక్ష సంబంధమేమీ లేదన్నారు. 2008లో ఉగ్రవాదుల దాడి కారణంగా జరిగిన ముంబై పేలుళ్లలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాల పాలైన సంగతి తెలిసిందే. సమావేశానంతరం దురానీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అది అయితే నాకు స్పష్టంగా తెలుసు. పాక్‌ ప్రభుత్వానికి గాని, ఐఎస్‌ఐకి గాని ముంబై పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేదు. ఇది నూటికి 110 శాతం స్పష్టం’ అని అన్నారు.

2009లో ముంబై దాడుల దోషి కసబ్‌ గురించి ప్రకటన చేసినందుకు ప్రభుత్వం తనను పదవి నుంచి తప్పించిన విషయాన్ని దురానీ గుర్తుచేసుకున్నారు. ముంబై పేలుళ్ల సూత్రధారి జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో పాకిస్తాన్‌కు ప్రయోజనమేదీ లేదని.. అతడిని శిక్షించాలని అభిప్రాయపడ్డారు. ముంబై దాడుల వెనుక పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని, సయీద్‌పై చర్యలు చేపట్టాలని భారత్‌ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తూ వస్తోంది. అయితే సయీద్‌పై చర్యలు చేపట్టడానికి మరిన్ని ఆధారాలు చూపాలని పాకిస్తాన్  కోరుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement