షాకింగ్‌: భారత్‌లో ఫస్ట్‌ ‘బ్లూ వేల్‌’ సూసైడ్‌ | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: భారత్‌లో ఫస్ట్‌ ‘బ్లూ వేల్‌’ సూసైడ్‌

Published Tue, Aug 1 2017 10:53 AM

చనిపోయే ముందు మన్‌ప్రీత్‌ చివరి సెల్ఫీ

ముంబై: ఆండ్రాయిడ్‌ గేమ్‌ ఆదేశాలను పాటిస్తూ 50 రోజులపాటు రకరకాల టాస్క్‌లు చేసిన ఓ టీనేజర్‌.. చివరి టాస్క్‌గా ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రపంచదేశాలను గడగడలాడించిన ఆ గేమ్‌ పేరు.. బ్లూ వేల్‌ ఛాలెంజ్‌. ముంబైకి చెందిన స్కూల్‌ విద్యార్థి మన్‌ప్రీత్‌ సింగ్‌ సహాని శుక్రవారం సాయంత్రం తానుండే అపార్ట్‌మెంట్‌ పై నుంచి కిందికి దూకి చనిపోయాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఈ ఘటనను భారత్‌లో మొట్టమొదటి బ్లూ వేల్‌ సూసైడ్‌గా భావిస్తున్నారు.

ముంబైలోని అంధేరీలో తల్లిదండ్రులతో కలిసి నివసించే మన్‌ప్రీత్‌.. స్థానిక స్కూల్లో ఎనిమొదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లిన అతను.. ఫ్రెష్‌ అయి, నేరుగా ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌ పై భాగానికి వెళ్లాడు. పిట్టగోడపై కూర్చొని స్నేహితులతో చాటింగ్‌ చేశాడు. బిల్డింగ్‌పైన కూర్చున్న ఫొటోకు..‘నా గుర్తుగా మీకు మిగిలేది ఈ ఫొటో మాత్రమే’ అని కామెంట్‌ పోస్ట్‌చేసి కిందికి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మన్‌ప్రీత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దర్యాప్తులో భాగంగా అతను వాడిన గాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని పరిశీలించగా షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయని ముంబై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌(ఐదో జోన్‌) నవీన్‌చంద్రారెడ్డి తెలిపారు. మన్‌ప్రీత్‌ గత కొంత కాలంగా బ్లూ వేల్‌ ఛాలెంజ్‌ టాస్క్‌లు చేస్తున్నాడని, అందులో భాగంగానే బిల్డింగ్‌పైకి ఎక్కి దూకి ఉంటాడని అన్నారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి బ్లూ వేల్‌ సూసైడ్‌ కేసుగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘నేను సోమవారం నుంచి స్కూల్‌కి రాను’అని మన్‌ప్రీత్‌ తన స్నేహితులతో చెప్పినగ్లు తెలిందని డీసీపీ రెడ్డి వివరించారు. కాగా, మన్‌ప్రీత్‌ తండ్రి నేవీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని, ప్రస్తుతం కుమారుడి అంత్యక్రియల నిమిత్తం కుటుంబమంతా స్వస్థలానికి వెళ్లిందని, వారు తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.


ఏమిటీ బ్లూ వేల్‌ యాప్‌?
బ్లూ వేల్‌ ఛాలెంజ్‌ అనేది ఓ ఆండ్రాయిడ్‌ గేమ్‌. దీన్ని రిజిస్టర్‌ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్‌ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్‌ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు.

చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్‌ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్‌ ఛాలెంజ్‌ గేమ్‌.. క్రమంగా యూరప్‌, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement