అసలు నువ్వు తం‍డ్రిగా పనికిరావు! | Sakshi
Sakshi News home page

అసలు నువ్వు తం‍డ్రిగా పనికిరావు!

Published Tue, Jul 19 2016 9:42 AM

అసలు నువ్వు తం‍డ్రిగా పనికిరావు!

మాజీ భార్యకు ఎనిమిదేళ్ల కూతురిని చూపించనందుకు ముంబైవాసికి మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా పడింది. ఈ మేరకు ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మండిపడింది. షాహిద్ పలావ్కర్ (42) అనే వ్యక్తి ఇంతకుముందు తన భార్యకు పోస్టు ద్వారా విడాకులు ఇచ్చాడు. అయితే తన కూతురిని భార్యకు చూపించకుండా దాచిపెడుతున్నట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. దాంతో షాహిద్ అసలు తండ్రిగానే పనికిరాడంటూ జస్టిస్ రేఖ మండిపడ్డారు. తన బావమరిది తన కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ అతడు చేసిన ఆరోపణలు కూడా తప్పని తేలింది.

కస్టడీ అంశంపై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు కూతురు కూడా తల్లివద్దే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వాస్తవాలు చాలా దిగ్భ్రాంతికరంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూతురిని ఆ తండ్రి దగ్గర ఉంచడం ప్రమాదకరంగా మారుతుందని జస్టిస్ రేఖ అన్నారు. తండ్రి పనికిమాలినవాడని తేలడంతో, ఇక కూతురి బాధ్యతను తక్షణం తల్లికి అప్పగించాలని ఆమె ఆదేశించారు. కూతురిని తల్లికి చూపించకుండా ఉండేందుకు రకరకాల కుట్రలు పన్నాడని, చివరకు చిన్నారిని కూడా ఆ కుట్రలో ఒక పావుగా వాడుకున్నాడని అన్నారు. ఇందుకు గాను మూడు నెలల జైలుశిక్ష విధించి, భార్యకు రూ. 5 లక్షల పరిహారం కట్టాలని తీర‍్పు చెప్పారు.

Advertisement
Advertisement