నా కుటుంబానిది సమాజ సేవ: చంద్రబాబు నాయుడు | Sakshi
Sakshi News home page

నా కుటుంబానిది సమాజ సేవ: చంద్రబాబు నాయుడు

Published Tue, Sep 17 2013 3:07 AM

నా కుటుంబానిది సమాజ సేవ: చంద్రబాబు నాయుడు - Sakshi

సాక్షి, హైదరాబాద్: వ్యాపారాలు చేయడం ద్వారా తన కుటుంబసభ్యులు సమాజానికి సేవ చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. వారు ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడకుండా వృత్తి నైపుణ్యంతో వాటిని నిర్వహిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీ ఆరు రాష్ట్రాల్లోని 11 లక్షల మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకే శ్, కోడలు బ్రహ్మణిల ఆస్తుల వివరాలంటూ సోమవారం తన నివాసంలో విలేకరులకు బాబు పలు పత్రాలు విడుదల చేశారు. 1992లో రిజిస్టరయిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 1993లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటికి  21 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. సంస్థ టర్నోవర్ ప్రస్తుతం రూ.1,600 కోట్లు కాగా నికర లాభం రూ.49.96 కోట్లని చెప్పారు. కంపెనీ బాధ్యతలను తన భార్య చూసుకుంటున్నారని, ప్రస్తుతం కోడలు కూడా అందులో భాగస్వామి అయ్యారని చెప్పారు. తాను కంపెనీ  నుంచి వైదొలగినప్పటి నుంచీ భార్య కష్టపడి దాన్ని ఈ స్థితికి తెచ్చారన్నారు.
 
 నెలలో 10 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి పర్యవేక్షిస్తుండటం వల్లే చిల్లింగ్ సెంటర్ స్థాయి నుంచి సంస్థ ఈ స్థితికి చేరుకుందన్నారు. ప్రస్తుతం తన ఆస్తి రూ.42 లక్షలు మాత్రమేనని ఈ సందర్భంగా బాబు చెప్పారు. అందులో తనకు వేతనంగా లభించే మొత్తంతో పాటు ప్రస్తుతం నివాసముంటున్న భవనం, పాత కారు ఉన్నాయన్నారు. భువనేశ్వరికి రూ.33 కోట్లు (అప్పులు మినహాయించి), లోకేశ్‌కు రూ.4.9 కోట్లు (అప్పులు మినహాయించి), బ్రహ్మణికి రూ.3.3 కోట్ల ఆస్తి మాత్రమే ఉందన్నారు. తన కుటుంబీకులు నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్‌కు రూ.25.41 కోట్ల ఆస్తులు, రూ.28.28 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. లోకేశ్ బెంగళూరులోని తన ఆస్తిని ఇటీవలే విక్రయించారన్నారు. తనకు డబ్బులపై వ్యామోహం లేదన్నారు. రాజకీయ నాయకుల ఆస్తులను ప్రకటించడానికి చట్టం తేవాలన్నారు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, దాన్ని సరిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
 
 ‘సాక్షి’ని స్వాధీనం చేసుకోరేం?!
 విలేకరుల సమావేశంలో యథావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లపై బాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి పత్రిక, చానల్, భారతి సిమెంట్‌లను ఎందుకు స్వాధీనం చేసుకోరని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులను ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్‌పై ఉన్న సీబీఐ కేసును నీరుగార్చేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వారి మధ్య అవగాహన కుదిరిందని, అందుకే ‘మా నేతకు బెయిల్ వస్తుంద’ని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ గెలిచేసి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందోనన్న భయంతోనే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా వచ్చే సానుకూల ఓటు కోసం టీఆర్ ఎస్‌తో సఖ్యతగా ఉంటూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్నారు.
 
 రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని రాష్ట్రపతి, ప్రధాని పలు పార్టీల నేతలకు వివరించేందుకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు  తెలిపారు. ప్రధాని చేతిలో అధికారం లేదని మొత్తం సోనియానే నడిపిస్తున్నారని అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ కుట్రపూరితంగా పదవీచ్యుతుణ్ణి చేశాక ఆయనతిరిగి సీఎం అయిన సెప్టెంబర్ 16న తాను ఆస్తులు వెల్లడిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమారుడు, లీకు వీరుడని ఎద్దేవా చేశ్నారు. డీజీపీ వి.దినేశ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనను పదవిలో కొనసాగించటం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయటం తప్పన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement