కనిష్టానికి సాగర్‌! | Sakshi
Sakshi News home page

కనిష్టానికి సాగర్‌!

Published Mon, Mar 20 2017 2:54 AM

కనిష్టానికి సాగర్‌! - Sakshi

- కనీస మట్టం 510 అడుగులకు చేరువగా నీటి లభ్యత
- శ్రీశైలం నుంచి 9 టీఎంసీల నీరొస్తేనే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా
- లేదంటే పంపులు దిగువకు దించాల్సిందే


సాక్షి, హైదరాబాద్‌

తెలుగు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత కనీస మట్టానికి పడిపోయింది. ఎగువ నుంచి ప్రవాహాలు పూర్తిగా పడిపోవడం, దిగువకు క్రమంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో సాగర్‌ మట్టం కనిష్టానికి చేరింది. సాగర్‌ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ఆదివారం ఉదయం 510.5 అడుగులు ఉంది. అది ఏ క్షణమైనా కనిష్టానికి పడిపోనుంది. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా, సాగర్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో ఈ ఏడాది సాగర్‌ పూర్తి స్థాయిలో నిండనేలేదు.

ఇదే సమయంలో శ్రీశైలం, సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటి విషయంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు నెలకొనడంతో కృష్ణాబోర్డు కనీస మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని పంచేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు, సాగర్‌లో 503 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ఎండీడీఎల్‌ దిగువన లభ్యతగా ఉండే 44 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు పంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు మొదట శ్రీశైలంలో కనీస నీటి మట్టం 834 అడుగుల దిగువకు వెళ్లి నీటిని వినియోగిస్తున్నాయి. దీంతో అక్కడ ప్రస్తుత మట్టం 814.8 అడుగులకు పడిపోయింది. అక్కడ 37.25 టీఎంసీలు మేత్రమే నీటి లభ్యత ఉంది. ఇందులోనూ బోర్డు చెప్పిన 785 అడుగుల వరకు గరిష్టంగా 10 నుంచి 13 టీఎంసీలు మించి తీసుకోవడానికి వీలుపడదు.

ఇక సాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటికి, ఎడమ కాల్వ కింద సాగుకు నీటిని వదిలేస్తుండటంతో అక్కడ మట్టం 510.5 అడుగులకు చేరింది. అది సోమవారం ఉదయానికి కనిష్టానికి చేరనుంది. సాగర్‌లో కనిష్ట నీటి మట్టం పడిపోవుతుండటంతో తెలంగాణ ఇటీవలే బోర్డుకు లేఖ రాసింది. ఎగువ శ్రీశైలం నుంచి తన వాటా కింద రావాల్సిన 9.2 టీఎంసీలను దిగువకు విడుదల చేయాలని కోరింది. దీంతో ఏపీ ఆదివారం 5,941 క్యూసెక్కుల మేర సాగర్‌లోకి నీటిని విడుదల చేస్తోంది. అయితే సాగర్‌ నుంచి 10,089 క్యూసెక్కుల మేర నీరు బయటకు విడుదల చేస్తుండటంతో కనిష్ట మట్టాలను మెయింటేన్‌ చేయడం సాధ్యపడట్లేదు. ఒకవేళ సాగర్‌ నీటి లభ్యత 510 అడుగులకు తగ్గిపోయినట్లయితే హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే పంపులు ఆగిపోనున్నాయి. హైదరాబాద్‌ అవసరాలకు నెలకు 1.8 టీఎంసీ చొప్పున సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా అది సాధ్యపడదు. ఈ పరిస్థితుల్లో పంపులను మరింత కిందకి దించి నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది సైతం ఇదే రీతిన కనిష్టంగా 503 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ప్రస్తుత ఏడాది సైతం అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement