Sakshi News home page

టెక్నాలజీయే పరిష్కార మార్గం

Published Tue, Aug 25 2015 1:45 AM

టెక్నాలజీయే పరిష్కార మార్గం - Sakshi

* టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా
* పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి
* రాష్ట్రాభివృద్ధికి సలహాలిస్తానని హామీ

సాక్షి, విజయవాడ బ్యూరో: దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు అధునాతన టెక్నాలజీయే పరిష్కార మార్గాలు చూపుతుందని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరి సరాల పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన అనే క ఇబ్బందులను టెక్నాలజీ ద్వారా అధిగమించవచ్చని ఆయన తెలిపారు.

సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రతన్ టాటా, ఏపీ సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు రతన్‌టాటా సమాధానం చెప్పారు. టాటా ట్రస్ట్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే పలు సామాజిక ప్రాజెక్టుల ఎంఓయూకు తాను మద్దతిస్తానని తెలిపారు. తొలుత సీఎం మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి పరిశ్రమలకు రతన్‌టాటా సింబల్‌గా ఉన్నారని, ఆయన దేశానికి ఒక ఐకాన్ అని ప్రశంసించారు.  
 
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం...
రాష్ట్ర ప్రభుత్వంతో టాటా ట్రస్టు చేసుకున్న ఒప్పందం ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని రతన్‌టాటా అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి అదనపు కార్యదర్శి  శాంతిప్రియపాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్రామన్‌లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
 
బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేను: రతన్
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని సీఎం చేసిన విజ్ఞప్తిని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా తిరస్కరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేర కు క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్రాని కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని బాబు టాటాను కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు.

వ్యాపారాభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇస్తానని చెప్పారు. పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ పలువురు ఏపీలో టీసీఎస్ కంపెనీని ఏర్పాటు చేయాలని కోరగా ఇప్పుడు టాటా గ్రూపునకు తాను చైర్మన్‌ను కాదని, ఈ ప్రతిపాదనను గ్రూపునకు సూచిస్తానని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement