ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు | Sakshi
Sakshi News home page

బిగ్‌ బ్రేకింగ్‌: ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు

Published Sun, Jan 1 2017 12:04 PM

ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీ ఎస్పీలో ఎడతెగని డ్రామా కొనసాగుతూనే ఉంది. నిన్నటికినిన్న ముగిసిందనుకున్న ఆధిపత్యపోరు మళ్లీ కొత్త రూపులో తెరపైకి వచ్చింది. పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ ఆదివారం పార్టీ కార్యవర్గ జాతీయ సదస్సు నిర్వహించారు. లక్నోలోని జానేశ్వర్‌ మిశ్రా పార్కులో నిర్వహించిన ఈ సదస్సుకు ఏకంగా యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొనడమే కాకుండా.. తండ్రి ములాయం స్థానంలో ఎస్పీ జాతీయ అధ్యక్షుడి పగ్గాలను చేపట్టారు. జాతీయ కార్యవర్గ సదస్సులో ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాంగోపాల్‌ యాదవ్‌ ప్రకటించారు. అంతేకాకుండా ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ్‌పాల్‌ యాదవ్‌ను తొలగించామని, అమర్‌సింగ్‌పై వేటు వేశామని కార్యవర్గ సదస్సు నిర్ణయాలను వెల్లడించారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని అఖిలేశ్‌ను, ఆయన సన్నిహితుడు రాంగోపాల్‌ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఇద్దరిపై బహిష్కరణ వేటును ములాయం ఎత్తివేశారు. దీంతో అఖిలేశ్‌ ఆదివారం తలపెట్టిన జాతీయ సదస్సును వాయిదా చేసుకుంటారని అంతా భావించారు. అయితే, పార్టీ మీద గట్టి పట్టుకు ప్రయత్నిస్తున్న అఖిలేశ్‌ తండ్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ సదస్సును నిర్వహించారు. మరోవైపు ఈ సదస్సుపై ఎస్పీ చీఫ్‌ ములాయం కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఈ సదస్సు పార్టీ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు చర్యలు తప్పవని అఖిలేశ్‌ వర్గాన్ని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
 

Advertisement
Advertisement